BRS- RK: మెత్తినట్టు మాట్లాడితే వెంట్రుకలు కూడా కదలవని ఓ సామెత.. అదే గుద్దినట్టు మాట్లాడితే అసలు విషయాలు వీరిలోకి వస్తాయని ఓ నానుడి. ఇప్పుడు దీన్నే గట్టిగా పట్టుకున్నారు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ.. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కడ చెడిందో గాని ఇప్పుడు ఇద్దరి మధ్య టర్మ్స్ బాగోలేవు. ఎప్పుడు గాడిన పడతాయో ఎవరికీ తెలియదు. దూరం ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు గోక్కుంటూనే ఉంటారు.. ఇందులో రాధాకృష్ణకు దుగ్ధ ఎక్కువ కాబట్టి కాస్త ఎక్కువ గోకుతాడు.

అప్పట్లో ఢిల్లీలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేసింది ఆంధ్రజ్యోతి మాత్రమే.. బయటకు తెలియని ఎన్నో విషయాలను తనకు ఉన్న పిఆర్ ద్వారా రాధాకృష్ణ బయటపెట్టాడు.. కవితను బయటకు ఈడ్చాడు. దెబ్బకు కవిత రాధాకృష్ణతో ఇంటర్వ్యూలో పాల్గొనే పరిస్థితి కల్పించాడు.. అసలే టెంపర్ మెంట్ ఎక్కువ ఉన్న క్యాండెట్ కాబట్టి కవితను చెడుగుడు ఆడుకున్నాడు. అంతేకాదు ప్రగతి భవన్లో అంతర్గతంగా కవితను కేసీఆర్ ఏ విధంగా మందలించాడో కూడా బయటపెట్టాడు. దీంతో నీళ్లు నమలడం కవిత వంతు అయింది.. ఈ పరిణామం తర్వాత మద్యం కుంభకోణం విషయంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీని తర్వాతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలకమైన అడుగులు వేసింది.. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ… ఇప్పటికైతే కవితకు త్రెట్ మాత్రం ఉంది.
మునుగోడు ఉపఎన్నిక ముందు వెలుగు చూసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసు తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. కానీ తర్వాత అసలు పలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో… భారత రాష్ట్ర సమితికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.. ఏకంగా కెసిఆర్ వరుస ప్రెస్ మీట్ లు నిర్వహించే దాకా వెళ్ళింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహిత్ రెడ్డిని వేమూరి రాధాకృష్ణ తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ కు పిలిచాడు. కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగాడు.. సమాధానాలు కూడా రాబట్టాడు.. నిన్న విడుదలైన ఈ కార్యక్రమం ప్రోమో చర్చకు దారితీస్తోంది.

వాస్తవానికి ఈ రెండు విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఏ మీడియా సంస్థ కూడా ఇంటర్వ్యూ చేయలేదు.. ఈ ఉదంతాలకు సంబంధించి ప్రశ్నలు అడగలేదు.. కానీ రాధాకృష్ణ టెంపరమెంటు ఉన్న జర్నలిస్టు కాబట్టి ఎటువంటి భయం లేకుండా అటు కవితను, ఇటు రోహిత్ రెడ్డిని ప్రశ్నలు అడిగాడు.. పలు సమాధానాలు రాబట్టాడు. అంతే కాదు ఫామ్ హౌస్ డీల్స్ కేసులో మిగతా ఎమ్మెల్యేలను కూడా ఇంటర్వ్యూ చేసేందుకు రాధాకృష్ణ రెడీ అవుతున్నాడని సమాచారం.. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా త్వరలో ఇంటర్వ్యూ కి వస్తారని తెలుస్తోంది. మరి వీటి ద్వారా ఆర్కే ఇంకెన్ని ఆసక్తికర సమాధానాలు రాబడతాడో వేచి చూడాల్సి ఉంది.