Dharmana Krishna Das: గులివింద సమెతలా ఉంది కొందరు మంత్రుల పరిస్థితి. సొంతింటిని చక్కదిద్దు లేరు కానీ..అయిన దానికి కానిదానికి విపక్షాల మీద నోరు పారేసుకుంటారు. పదవులు పోతున్నాయన్న ప్రస్టేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్టదాస్ కు మంత్రి పదవి తొలగింపు ఖాయమని తేలడంతో మైండ్ బ్లాక్ అయినట్టు ఉంది. అందుకే అతను కొత్తగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి పోయింది. పోనీ పార్టీ పదవైనా దక్కుతుందన్న గంపెడాశలు పెట్టుకున్నారు. రీజయన్ స్థాయిలో పార్టీ పగ్గాలు ఆశిస్తున్నారు. అది వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
ఆయనకు అంతా సీన్ లేదు. పార్టీని సమన్వయం చేసుకునే శక్తీ లేదు. ఇస్తే గిస్తే బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలు అప్పగిస్తారు కానీ.. క్రిష్టదాస్ కు అంత సీను లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు అదే జిల్లాకు చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మంత్రివర్గంలో కొనసాగింపు ఉందని తెలియడంతో క్రిష్టదాస్ తెగ గింజుకుంటున్నారట. అసహనంలో చాలానే మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన బాగుండేది అని, సోదరుడు ధర్మాన ప్రసాదరావుతో ధర్మయద్ధం చేశానని, అయినా ఆయనకే మంత్రి పదవి దక్కుతుందని.. తనకు పదవి పోయినా కుటుంబసభ్యుడికే వస్తుందని.. పవన్ కళ్యాణ్ సినిమాలో కాదు తనతో తలపడమని..ఇలా రోజుకో కామెంట్స్ తో కాక పుట్టిస్తున్నారు. ఆయన స్వభావానికి సూటుకాని మాటలతో రక్తి కట్టించాలని చూస్తున్నారు. ఆయన మాటల్లో డొల్లతనం, అసంత్రుప్తి భావజాలం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఉత్తరాంధ్రలో తానే సీనియర్ నని చెప్పుకొచ్చిన క్రిష్టదాస్ కు మంత్రి పదవి తొలగింపుతో తత్వం బోధపడింది. అధినేతకు తానొక్కడినే అన్నట్టు వ్యవహరించి బొక్ల బోర్లా పడడం పాపం మన ధర్మాన వారి వంతైంది.
మంత్రి పదవికి ఎసరు వస్తుందన్న ప్రతీసారి చాలా మంది అమాత్యులు తిట్ల దండకాన్ని పూనుకుంటున్నారు. అందులో క్రిష్ణదాస్ అతీతం కాదు. గతంలో కూడా ఈయన ఇలానే వ్యాఖ్యలు చేశారు. అదే జిల్లాకు చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుపై సైతం ఒంటికాలితో లేచి తిట్ల దండకం అందుకున్నారు. నీచమైన భాషతో మాట్లాడారు. ఉపాధి పనుల విషయంలో కూడా వివాదాస్పద కామెంట్లు చేశారు. చెట్టు కింద కూర్చొని వేతనాలు తీసుకుంటున్నారని.. ఉపాధి పనుల వల్ల తమ పొలం పనులకు ఎవరూ రావడం లేదని కూడా ఆక్రోషం వ్యక్తం చేశారు.
దీనిపై విమర్శలు వ్యక్తమైన ఆయన వెనక్కి తగ్గలేదు సరికదా.. ఇప్పటికీ కామెంట్స్ చేస్తునే ఉన్నారు. వాస్తవానికి తన మూడేళ్ల మంత్రి పదవితో ఆయన కుటుంబం బాగానే వినియోగించుకుంది. నరసన్నపేట నియోజకవర్గంలో తమ్ముడు ధర్మాన ప్రసాదరావు వేసిన రాజకీయ పునాదిని క్రిష్టదాస్ వచ్చి కబ్జా చేశారు. మూడేళ్ల పాటు మంత్రిగా ఉన్నా సోదరుడు ప్రసాదరావు వేదిక పంచుకుంది చాలా తక్కువ. క్రిష్టదాస్ భార్య పద్మప్రియతో పాటు కుమారుడు క్రిష్ణ చైతన్య అయిన దానికి కానిదానికి నియోజకవర్గంలో చేతులు పెడుతున్నారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో అసలు ధర్మాన ప్రసాదరావును పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంత చెడ్డ నరసన్నపేట నియోజకవర్గం నుంచే రాజకీయాలు నెరిపిన ధర్మాన ప్రసాదరావు దీనిని గమనించారు. తన పాత కాపులందర్నీ చేరదీశారు. వారితోనే క్రిష్ణదాస్ కు వ్యతిరేకంగా మంత్రాంగం నడిపిస్తున్నారు. ఒక వేళ మంత్రి పదవి వస్తే సైలెంట్ అవుతారు.
కానీ మంత్రి పదవి చేజారితే మాత్రం నరసన్నపేటలో తన ప్రతాపాన్ని చూపే అవకాశము ఉంది. అటు శ్రీకాకుళంలో కుమారుడు రామ్ మనోహర్ నాయుడును బరిలో దించి.. తాను నరసన్నపేట షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారు. ఈ పరిణామాలతో క్రిష్ణదాస్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పుడు మంత్రి పదవి పోవడం ఖాయమని తేలడంతో ఆయనకు ఎటూ పాలుపోవడం లేదు. అందుకే ఆ ప్రస్టేషన్ ను విపక్షాల నేతలపై చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో 70 మందిని కొట్టుండొచ్చు కానీ.. తనను ఢీ కొట్టాలన్న పిలుపును ఏమనుకోవాలి. సినిమాలో చూపిన పోరాట ద్రుశ్యాలనే ఆయన పరిగణలోకి తీసుకోవడాన్ని ఏమనుకోవాలి. ఏ సినిమా అయినా చివరకు మంచి అనే కోణాన్ని చూపిస్తారు. దానిని ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదో రాష్ట్రంలోనే మోస్ట్ వైసీపీ సీనియర్ నాయకుడిగా తనకు తాను అభివర్ణించుకునే ధర్మాన క్రిష్ణదాస్ కే తెలియాలి.