Revanth Reddy: అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు అని ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోగానే.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాము ఎంత ఇబ్బంది పడ్డామో ఒక్కొక్కరుగా బయటికి వచ్చి చెబుతున్నారు. అందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా ఉన్నారు. ఈ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి అధికార భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి మీద ఘన విజయం సాధించారు. అయితే ఈయన విజయం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. 2023 లో జరిగే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని.. అందుకు నర్సిరెడ్డి సాధించిన విజయమే నాంది అని అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే నర్సిరెడ్డి విజయం పట్ల మొదటి నుంచి అధికార భారత రాష్ట్ర సమితి గుర్రుగా ఉండేది.. తన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓడించాడనే అక్కసు తో నర్సిరెడ్డిని ఇబ్బంది పెట్టేదనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే అప్పట్లో నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా తాను పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేశారు. లాభం లేకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం 30 సార్లు ప్రయత్నించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయేది. ప్రగతి భవన్ కు పలుమార్లు వెళ్లినప్పటికీ నిరాశతోనే ఆయన వెనుతిరిగి వచ్చేవారు. ఇదే విషయాన్ని ఆయన శాసనమండలిలో పలుమార్లు చెప్పారు కూడా. అయితే నర్సిరెడ్డి ఈ విషయాన్ని శాసనమండలిలో ప్రస్తావించినప్పుడు అధికార భారత రాష్ట్ర సమితి నాయకులు ఆయన మీద ఆరోపణలు చేసేవారు.. అయితే ఈ లోగానే ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చురగొనడంలో విఫలం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గతంలో తన విజయాన్ని గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి వద్దకు నర్సిరెడ్డి వెళ్లారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటివరకు నర్సిరెడ్డి నాలుగు సార్లు ఆయనను కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలపై, విద్యారంగంలో తీసుకోవలసిన మార్పులపై, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన విధానాలపై ముఖ్యమంత్రితో కలిసి చర్చించారు. నాలుగు సార్లు నర్సిరెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతేకాదు నర్సిరెడ్డి ఇచ్చిన సూచనలను ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని ప్రకటించారు. ఇక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను కూడా త్వరలోనే అమలు చేస్తామని నర్సిరెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే గడిచిన 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తాను కేసీఆర్ ను కలవలేదని నర్సిరెడ్డి ఇటీవల విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ప్రగతి వద్దకు వెళ్లి తాను నిరాశతో వెన్ను తిరిగి వచ్చిన సందర్భంలో చాలా ఉన్నాయని, ఒక ఎమ్మెల్సీ అయిన నాకే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని నర్సిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.