Caste politics: ప్రపంచంలో ఏ దేశంలో లేని కులాల(Caste) ప్రస్థావన మన దేశంలో ఉంది. పూర్వ కాలంలో వారి స్వార్థం కోసం తెచ్చిన ఆచారం క్రమంగా గ్రహచారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు తమ పలుబడి సాధించేందుకు ప్రజలను కులాల వారీగా విడగొట్టి ఫలితం పొందుతున్నారు. దీంతో మనం మనుషులమనే భావం పోయి కులమే ప్రధానంగా వినిపిస్తోంది. కులమే తమ బలంగా మనుషులు మారిపోయారు. కులం వల్ల ఒరిగిందేమీ లేదని తెలిసినా ఎందుకో కులపిచ్చి గజ్జిలా అంటుకుంది. ఈ నేపథ్యంలో ఏదైనా జరిగితే మా కులం వాడని గొడవలు చేయడం కూడా సాధారణమైపోయింది.
ఇక రాజకీయాలన్ని (Politics) కులం చుట్టూరా పరిభ్రమిస్తున్నాయి. కుల లెక్కలే ఆధారంగా పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయి. మంత్రి పదవుల పంపిణీలో కూడా కులమే ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. ప్రభుత్వాల మనుగడలో కులం ఒక పిల్లర్ గా ఉంటోందన్నది నిర్వివాదాంశమే. కులాన్ని అడ్డుపెట్టుకుని చాలా విషయాలు నడుస్తున్నాయి. అసలు ఉద్దేశం వేరే ఉన్నా దాన్ని అడ్డదారుల కోసమే ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కుల గణన చేపట్టాలని పదేళ్లుగా డిమాండ్లు వస్తున్నాయి. ప్రతి దానికి కులమే తొలి ఆయుధంగా మారుతున్న తరుణంలో కులాల లెక్కలు ఉండాల్సిందేనని పార్టీలతో పాటు కులాల నాయకులు కూడా కోరుతున్నారు. ప్రజాస్వామ్యంలో బలమంతా కులంలోనే ఉందని తెలుస్తోంది. అందుకే కుల గణన చేపట్టాలని కోరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కులగణనపై డిమాండ్లు పెరుగుతున్నాయి.
కులం రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిపోయింది. వారిని ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేసే వరకు కులాలు ఎదిగిపోయాయి. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం కులాలను తమ ఆయుధంగా చేసుకుంటున్నాయి. ఓట్లు వేసేందుకు వారిని తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. కులాల ప్రాతిపదికపైనే టికెట్లు కేటాయిస్తున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 75 సంవత్సరాలు దాటినా రిజర్వేషన్ల ఫలాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలే కాకుండా ఇతర కులాల్లో కూడా వెనుకబడిన వారున్నా వారికి మాత్రం ఎలాంటి ప్రతిఫలం దక్కడం లేదు. కానీ రాజకీయ నేతలు మాత్రం తమ అవసరాలు తీర్చుకునే క్రమంలో వారిని పావులుగా వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కుల గణన డిమాండ్ తెరమీదకు రావడంతో పార్టీలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. కులాల వారీగా జనాభా ఎంత అనే విషయం తెలిస్తేనే వారిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుందన్నది వారి ఉద్దేశం. అందుకే కుల గణన పాట అందరి నోట వినిపిస్తోంది.