https://oktelugu.com/

దుబ్బాకలో రఘునందన్‌రావుకు సింపతి కలిసొచ్చేనా

మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకోనుంది. వన్‌ బై వన్‌ ఎలక్షన్లు రాబోతున్నాయి. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ.. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక.. ఆ వెంటనే గ్రేటర్‌‌ హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలతో హీటెక్కిస్తున్నారు. పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. Also Read: తెలంగాణ.. ఓ గొప్ప విజయం! ఈసారి దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అన్ని పార్టీలూ పోటీకి సై అనడంతో పోటీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2020 / 08:49 AM IST

    Raghu

    Follow us on

    మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకోనుంది. వన్‌ బై వన్‌ ఎలక్షన్లు రాబోతున్నాయి. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ.. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక.. ఆ వెంటనే గ్రేటర్‌‌ హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలతో హీటెక్కిస్తున్నారు. పర్యటనలతో హోరెత్తిస్తున్నారు.

    Also Read: తెలంగాణ.. ఓ గొప్ప విజయం!

    ఈసారి దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అన్ని పార్టీలూ పోటీకి సై అనడంతో పోటీ రసవత్తరం కానుంది. బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్‌రావు పేరే ఈసారీ ఫైనల్‌ అయ్యేలా ఉంది. పార్టీ పేరు ప్రకటించకముందే రఘునందన్‌రావు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయశాంతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈమెతోపాటే మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకు పేరు కూడా వస్తోంది. ఇండిపెండెంట్‌గా కత్తి కార్తీక బరిలోకి దిగుతోంది. ఇక అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఇంతవరకు క్యాండిడేట్‌ ఎవరనేది ఫైనల్‌ కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌‌ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పేరు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. అది జరగలేదు. అయితే.. రామలింగారెడ్డి కుటుంబానికే టికెట్‌ ఇస్తారా..? లేదా మరో నేతను వెతుకుతారా..? అనేది ఆసక్తిగా మారింది.

    అయితే.. టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఎవరికిచ్చినా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగానే పోటీ జరుగబోతోందనేది తెలుస్తోంది. వాస్తవానికి 2004 నుంచే దుబ్బాక టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలుస్తోంది. రామలింగారెడ్డి 2004,2008 ఉప ఎన్నికల్లో గెలవగా.. 2009 ఎన్నికల్లో ఓడారు. తర్వాత 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. గత 15 ఏళ్లలో ఇక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీనే నాలుగు సార్లు గెలిచింది. కానీ.. అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందనేది ప్రజల అభిప్రాయం. పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలు అభివృద్ధిలో అంచనాకు దొరకకుండా దూసుకుపోతుంటే.. దుబ్బాకకు ఆ అదృష్టం లేకుండా పోయిందనేది ప్రజల్లో నెలకొన్ని అసంతృప్తి.

    రామలింగారెడ్డి మీద ఉన్న అభిమానమా.. లేక టీఆర్‌ఎస్‌ పార్టీ మీద ఉన్న నమ్మకమో తెలియదు కానీ ఒక్కసారి మినహా ప్రతీ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధిస్తూ వచ్చారు. గత ఎన్నికలో రామలింగారెడ్డి మీద పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఓడిపోతూనే ఉన్నారు. అయితే.. ఆయన ఓడినా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిపై పోరాడుతూనే ఉన్నారు. రఘునందన్‌ గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా.. పార్టీ పటిష్టానికి ఎంతగానో కృషి చేశారు. 2014 ఎన్నికల వరకు కూడా చాలా కష్టపడ్డారు. ఆ టైంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడారు.

    Also Read: తెలంగాణ మహిళలకు కేసీఆర్ సర్ ప్రైజ్

    2014  ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టికెట్‌ లభించకపోవడంతో బీజేపీలోకి జంప్‌ అయ్యారు. రామలింగారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లోనూ ఆయన మరోసారి బరిలోకి దిగినా చేదు అనుభవమే ఎదురైంది. అనంత‌రం 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ మెద‌క్ ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇన్ని సార్లు ఓడినా పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ మళ్లీ పోటీకి దిగుతూనే ఉన్నారు రఘునందన్‌రావు.

    ఓ వైపు వరుస ఓటములు వెంటాడుతున్నా.. దుబ్బాకను మాత్రం వదలడం లేదు. అయితే.. ఈసారి ఆయనకు సానుభూతి కలిసొస్తుందేమోనని రాజకీయ విశ్వేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్ల కోసం శ్రమిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక‌ను బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం కూడా సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతోపాటు ఆర్థిక వ‌న‌రులు కూడా అందించే ప్రయ‌త్నాల్లో ఉంద‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ప్రతీసారి వార్‌‌ వన్‌ సైడ్‌ అని చెప్పుకునే  కేసీఆర్‌‌కు ఈసారి ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది.