Homeజాతీయ వార్తలుHyderabad Outer Ring Rail Project: ఎన్నికలొస్తున్నాయి.. అందుకే తెలంగాణకు కేంద్రం వరాలొస్తున్నాయి..

Hyderabad Outer Ring Rail Project: ఎన్నికలొస్తున్నాయి.. అందుకే తెలంగాణకు కేంద్రం వరాలొస్తున్నాయి..

Hyderabad Outer Ring Rail Project: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. పుంజుకునే దశలో ఉన్నప్పుడే కర్ణాటక ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవడంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒకింత సందిగ్ధమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లు బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ గా సాగిన రాజకీయ యుద్ధం బి ఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. దీంతో ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో పుంజుకొని అధికారులకు రావాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న అన్ని శక్తి యుక్తులను ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణకు కని విని ఎరుగని స్థాయిలో భారీ నజరానా ప్రకటించింది. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రైల్వే లైన్ ఏర్పాటు అవుతున్నది. ఈ మేరకు ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ తుది సర్వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ సర్వే కోసం 14 కోట్లు కేటాయించింది. రీజినల్ రింగ్ రోడ్డు, దానిపెంట ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో కూడా మార్పులు వస్తాయని భావిస్తోంది.. హైదరాబాద్ మహానగరానికి నలువైపులా ఉన్న రైల్వే లైన్లను అనుసంధానిస్తూ రీజినల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రైలు రింగ్ ప్రాజెక్టు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైలు సదుపాయం లభిస్తుంది. ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు త్వరగా, సులభంగా చేరుకోవచ్చు. దీంతోపాటు కరీంనగర్_ హసన్ పర్తి మధ్య 61 కిలోమీటర్ల రైల్వే లైన్ సర్వే కోసం రైల్వే శాఖ 1.5 కోట్లు కేటాయించింది.

ఇక భక్తుల సౌకర్యార్థం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు 330 కోట్లతో యాదగిరి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్ రెండవ దశ పనులను చేపట్టనుంది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఈ వ్యయంలో మూడింట రెండు వంతులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉన్నప్పటికీ ముందుకు రాలేదు. దీంతో మొత్తం ఖర్చులు కేంద్రమే భరించి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇక ఇవే కాకుండా రాష్ట్రాలకు మూలధనా పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకంలో భాగంగా 2020_21 నుంచి 2023_ 24 వరకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 5,221.92 కోట్లు కేటాయించింది. ఇక అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపింది. కానీ జీనో మ్ వ్యాలీలో ఈ కేంద్రం ఏర్పాటు కోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మంజూరు చేయలేదు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఇలాంటి వాటిని ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే రాష్ట్ర ప్రజలకు అంత ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రికి మరొకసారి లేఖ రాయాలని కేంద్రం భావిస్తుంది. అంతేకాదు దేశంలో పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సెప్టెంబర్ లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించనుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version