Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారాడు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు రౌజ్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశాయి. న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ఈ అభ్యర్థనను ఆమోదించారు. ఈ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అభియోగ పత్రాల్లో స్పష్టం చేశాయి. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ తో శరత్ చంద్ర రెడ్డి సిండికేట్గా ఏర్పడి ఢిల్లీ మద్యం వ్యాపారంలోకి ప్రవేశించినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ సిండికేట్ సభ్యులు 100 కోట్ల మేర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు చెల్లించగా.. అందులో 20 నుంచి 30 కోట్ల వరకు నగదును హైదరాబాదు నుంచి హవాలా మార్గంలో ఢిల్లీకి పంపినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారుల్లో శరత్ చంద్ర రెడ్డి ఒకరు. నిబంధనల ప్రకారం ఏ వ్యక్తికైనా రెండుకు మించి రిటైల్ జోన్లను కేటాయించకూడదు. కానీ అడుగడుగునా నిబంధనలకు వక్ర భాష్యం చెప్పారు.
అడ్డగోలుగా
ట్రైడెంట్ కెమ్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని బినామీ కంపెనీలు ఆర్గానమిక్స్ ఎకో సిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా 5 రిటైల్ జోన్లను శరత్ నిర్వహించారు. దినేష్ ఆరోరాకు చెందిన అతిపెద్ద కార్టెల్ లో శరత్ కీలక భాగస్వామిగా ఉన్నారు. ఈ కార్టెల్ భాగస్వామి అయిన సమీర్ మహేంద్రు ఫెర్నాడ్ రికార్డ్ పేరుతో దేశంలో అతిపెద్ద మద్యం ఉత్పత్తి కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ తన హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్ గా ఇండో స్పిరిట్ సంస్థను నియమించుకుంది. ఇండో స్పిరిట్ కు సమీర్ మహేంద్రు, కవిత బినామీగా చెబుతున్న అరుణ్ పిళ్లై, మాగుంట తరపున ప్రేమ్ రాహుల్ యజమానులుగా ఉన్నారు. ఈ కంపెనీలో కూడా శరత్ చంద్ర రెడ్డి బినామీల ద్వారా లావాదేవీలు నిర్వహించారు. ఇందులో కూడా ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ముడుపులు ఇవ్వడం ద్వారా అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన ఈ కార్టెల్.. ఢిల్లీ మద్యం మార్కెట్లో 30% వ్యాపారాన్ని చేజిక్కించుకుందని దర్యాప్తు సంస్థలు గతంలో కోర్టుకు తెలిపాయి.
నిబంధనలకు మంగళం
ఢిల్లీ మద్యం విధానం ద్వారా అక్రమ ప్రయోజనాలు పొందేందుకు తప్పుడు మార్కెట్ విధానాలకు శరత్ చంద్రారెడ్డి పాల్పడ్డారు. వివిధ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో కలిసి కుట్రపన్నారు. మద్యం విధానం లక్ష్యాలకు విరుద్ధంగా కార్టెల్ పద్ధతులు ఉపయోగించి మార్కెట్లో అత్యధిక వాటా పొందారు. ఈడి సోదాలు జరిపినప్పుడు రిటైల్ జోన్లలో ఉన్న కార్యాలయాల నుంచి పలు సర్వర్లను శరత్ చంద్రారెడ్డి గ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర ప్రాంతాల్లోకి తరలించే ప్రయత్నం చేశారు. శరత్ ఆదేశాల మేరకు తమ కార్యాలయాల్లో ఉన్న డిజిటల్ దాటాను తొలగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి విజయ్ నాయుడు ద్వారా ముడుపులు చెల్లించడం, కార్ట లైజేషన్ ద్వారా అవినీతి పద్ధతులు, కుట్రలకు పాల్పడడం ద్వారా శరత్ 64 కోట్ల మేరకు నేరానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అతడిని ఈ డి మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19 కింద నవంబర్ పదో తారీఖు అరెస్టు చేసింది.
భార్య విమానంలో.
శరత్ భార్య జెడ్ సెట్ ఏవియేషన్ వ్యవస్థాపకరాలు కనికా రెడ్డికి చెందిన చార్టెడ్ విమానాల్లో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు భారీ ఎత్తున నగదు తరలించారు. దీని ఆధారాల కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాసింది. కంపెనీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు విమానాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరింది. దీనికి సంబంధించిన వివరాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందజేసింది. ఇక మద్యం విధానానికి సంబంధించి జరిగిన సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఓబేరాయ్ హోటల్లో జెట్ సెట్ గో ఏవియేషన్ పేరిట గదులు బుక్ చేశారు. ఈ సమాచారం మొత్తం ఈడీ అధికారుల వద్ద ఉండడంతో గత్యంతరం లేక అప్రూవర్ గా మారాల్సి వచ్చింది.