Homeజాతీయ వార్తలుDelhi Coaching Centers : బాత్రూం లాంటి గదికి కళ్ళు బైర్లు కమ్మే అద్దె.. ఢిల్లీలో...

Delhi Coaching Centers : బాత్రూం లాంటి గదికి కళ్ళు బైర్లు కమ్మే అద్దె.. ఢిల్లీలో సివిల్స్ విద్యార్థుల కష్టాలు ఇన్నిన్ని కావయా?

Delhi Coaching Centers : భావి సివిల్ సర్వెంట్ కావాలని.. చాలామంది యువత ఢిల్లీ వెళ్తారు. అక్కడ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొని సివిల్స్ రాస్తారు. ఇందులో చాలామంది సివిల్ సర్వెంట్లుగా ఎంపికవుతారు. అయితే నిన్నా మొన్నటి వరకు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ పై చాలామందికి సదాభిప్రాయమే ఉండేది. కానీ గత శనివారం రావూస్ సివిల్స్ అకాడమీలో ముగ్గురు విద్యార్థులు వరదల వల్ల చనిపోవడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. సివిల్స్ కోచింగ్ సెంటర్లలో సౌకర్యాల లేమి పై రకరకాల కథనాలతో మీడియా హోరెత్తిస్తోంది. అయితే శనివారం ఆకస్మికంగా పోటెత్తిన వరదల వల్ల ముగ్గురు సివిల్స్ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఢిల్లీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, కోచింగ్ సెంటర్ నిర్వాహకుల ఉదాసీనత వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఓ విద్యార్థి ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్ర చూడ్ కు లేఖ రాయడం సంచలనం కలిగించింది. అయితే ఆ విద్యార్థి లేఖ రాసిన మరుసటి రోజు కొన్ని జాతీయ మీడియా సంస్థలు సంచలన కథనాలను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. అందులో ఒక కథనం ఢిల్లీలో సివిల్స్ విద్యార్థుల కష్టాలను కళ్లకు కట్టింది.

సహజంగానే ఖరీదు..

ఢిల్లీలో సహజంగానే ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతుంటాయి. సివిల్స్ కోచింగ్ నిమిత్తం ఢిల్లీ వచ్చే విద్యార్థులు వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిమంది సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వస్తుండడంతో ఇక్కడ యజమానులు ఇంటి అద్దెలను అమాంతం పెంచారు. ఢిల్లీలో పెరిగిన ఇంటి అద్దెపై ఓ యువకుడు తీసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

బాత్రూం లాంటి గది..

కేవలం 10 అడుగుల పొడవు, అదే స్థాయిలో వెడల్పు ఉన్న ఒక గదిలో ఓ విద్యార్థి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఆ గదిలో ఒక బల్ల, మీ బుక్స్ ఉంటాయి. ఒక కుర్చీ కూడా ఉంది. అటు ఇటు నడిచేందుకు కొంత స్థలం మాత్రమే ఉంది. ఆ గదిలో లోపల ఒకరు ఉంటే మరొకరు బయట ఎదురు చూడాలి. అంటే ఇద్దరు పట్టే స్థలం కూడా ఉండదు. అయితే అలాంటి గదికి ఢిల్లీలో యజమాని 12 నుంచి 15000 వరకు అదే వసూలు చేస్తున్నాడు. పైగా ప్రతి ఏడాది అద్దెను పెంచుతూనే ఉన్నాడు. కేవలం ఈగది మాత్రమే కాదు.. ఢిల్లీలో మెజారిటీ ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ స్థాయిలో ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ చాలామంది విద్యార్థులు సివిల్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఆ విద్యార్థి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

ఇక్కడ దాకా రావద్దు

ఈ వీడియోను డీఎస్పీ అంజలి కటారియా తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “పది అడుగుల పొడవు, అదే స్థాయిలో వెడల్పు ఉన్న గదికి 15 వేల అద్దె విద్యార్థులు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా నేను విద్యార్థులకు చెప్పేది ఒకటే ఢిల్లీకి వచ్చేందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందులో సివిల్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇంటికి దూరంగా ఉండాలని ఆలోచనతో ఢిల్లీ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సాధ్యమైనంతవరకు ఆన్ లైన్ లో తర్ఫీదు పొందడం ముఖ్యం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి డబ్బును, కాలాన్ని వృధా చేసుకోవద్దని” అంజలి పేర్కొన్నారు.

సోషల్ మీడియా షేక్

ఇక ఇటీవల ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వరదనీరు వచ్చింది. ఆ వరద నీరు వల్ల ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది . అయితే ఆ ముగ్గురి మరణాలకు కారణమైన కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కోచింగ్ సెంటర్ యజమాని, మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.. ఎప్పుడైతే రావూస్ కోచింగ్ సెంటర్ వ్యవహారం తెరపైకి వచ్చిందో.. సివిల్స్ విద్యార్థుల కష్టాలను మీడియా వెలుగులోకి తీస్తోంది. ఈ క్రమంలోనే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version