Delhi New CM (1)
Delhi New CM: ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు దాటింది. ప్రిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. 8న ఫలితాలు వచ్చాయి. కానీ సీఎం పీఠం ఎక్కేది ఎవరనే సస్పెన్స్(Suspence) కొనసాగుతోంది. సాధారణంగా బీజేపీకి ఎన్నికల ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించదు. ఢిల్లీ(Delhi) ఎన్నికల్లోనూ అదే సంప్రదాయం కొనసాగించింది. అయితే ఫలితాల తర్వాత సీఎం ఎంపికలో జాప్యం జరుగుతోంది. హరియాణా, ఒడిశా ఎన్నికల్లో ఎవరూ ఊహించని వ్యక్తులను బీజేపీ సీఎంలను చేసింది. ఢిల్లీలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నారు. సీఎం పదవి మహిళలకు అప్పగించాలనే యోచనలో బీజేపీ(BJP) పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ, షాలిమార్‌బాగ్ ఎమ్మెల్యే రేఖాగుప్తా పేర్లు వినిపిస్తున్నాయి. మహిళా సీఎంవైపు అధిష్టానం మొగ్గు చూపితే రేఖాగుప్తా సీఎం అవుతారు. పర్వేశ్ వర్మ డిప్యూటీ సీఎం అవుతారని సమాచారం.
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..
సీఎం ఎంపిక కోసం ఫిబ్రవరి 19న(బుధవారం) బీజేఎల్పీ సమావేశం జరుగుతుంది. దీనికి బీజేపీ ప్రధాన కార్యదర్శులు కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని ప్రకటించి తర్వాత ఎమ్మెల్యేలంతా నేరుగా లెఫ్టినెంట్ గవర్నర్(Leftnent Governar)ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 20న(గురువారం) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలుస్తోంది.
రేఖాగుప్తా..
ఇక రేఖాగుప్తా(Rekha gupta) విషయానికి వస్తే.. ఈమే బీజేపీ అభ్యర్థిగా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉన్నారు. కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆమెవైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు లేరు. ఇది కూడా రేఖాగుప్తాకు కలిసివచ్చే అంశం. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలను బీజేపీ సీఎంలను చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనూ అదే ఫార్ములా అనుసరించే అవకాశం ఉంది.