ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ రావాలని కేంద్రహోంశాఖ నుంచి పిలుపు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేసి వచ్చిన మూడురోజుల వ్యవధిలోనే గవర్నర్ హరిచందన్ కు ఢిల్లీ పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జగన్ పెండింగ్ బిల్లులన్నింటిని ఆమోదం కోసమే గవర్నర్ ను పిలిపించారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, మూడు రాజధానుల అంశం పెండింగ్ లో ఉండటం.. విభజన సమస్యలు ఇలా పలు అంశాలపై ఈ టూర్ లో గవర్నర్ తో కేంద్రం పెద్దలు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే అధికారికంగా ప్రభుత్వం చెప్పకపోయినా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలపై హోంమంత్రి అమిత్ షాతో జగన్ చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే గవర్నర్ కు పిలుపురావడాన్ని బట్టి చూస్తే జగన్ చర్చించిన అంశాలపై ఫాలో అప్ కోసం గవర్నర్ ను రప్పిస్తున్నారా? అన్న ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఎంపీ రఘురామ వ్యవహారంతోపాటు ఏడాదికి పైగా ఏపీలో పెండింగ్ లో ఉన్న మూడు రాజధానుల అంశంపైనా కేంద్రం పెద్దలు చర్చించే అవకాశాలున్నాయి. రఘురామ విషయంలో కేంద్రం పెద్దలు గవర్నర్ అభిప్రాయం తీసుకొని ముందుకెళుతారని తెలుస్తోంది.మూడు రాజధానులపై కూడా గవర్నర్ కు దిశానిర్ధేశం చేస్తారని అంటున్నారు.