ఏప్రిల్ 20వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి లాక్ డౌన్ లో మార్పులు, చేర్పులు ఉండవచ్చని తెలంగాణ సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అప్పటివరకు కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోందని సీఎం పేర్కొన్నారు. ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ అమలుతో పాటు పేదలకు సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిధులు చూపిస్తున్న చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్ డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ‘లాక్ డౌన్ అమలును, పేదలకు అందుతున్న సాయాన్ని, పంటల కొనుగోలు విధానాన్ని ప్రజాప్రతినిధులు ఎంతో చొరవ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. సర్పంచులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా పనిచేస్తున్నారు. ఈ పని ఇంకా కొనసాగాలి. ప్రజలను చైతన్యపరచాలి. ప్రభుత్వపరంగా జరుగుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలి. ఆరోగ్య, మున్సిపల్ మంత్రులు తప్ప మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలి’అని సీఎం కోరారు.
కరోనా వైరస్ సోకినవారికి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్తు అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 518 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, ఈ రోజు 128 మంది డిశ్చార్జి అవుతారని ఈటెల వివరించారు.