
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా ఇంత బలపడడానికి కారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం సత్యనారాయణ కూడా. వైఎస్ఆర్ హయాంలో కేసీఆర్ ను రెచ్చగొట్టి మరీ ఆయన చేత రాజీనామా చేయించేలా ఉసిగొల్పింది ఎంఎస్ఆర్ యే. దాంతో కరీంనగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ నాడు రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలిచి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించాడు.
ఎంఎస్ఆర్ వయసు ఇప్పుడు 89 సంవత్సరాలు. ఆయన వృద్ధాప్యంతో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా జరిగారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిజాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 3.45 నిమిషాలకు చనిపోయారు. కరోనా బారిన పడి మరణించారని వార్తలు వచ్చినా కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. ఆయన మరణంపై ఉమ్మడి కాంగ్రెస్ నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు.
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ లీడర్ ఎంఎస్ఆర్. గాంధీ కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. 1971లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా తొలిసారి ఆయన కరీంనగర్ ఎంపీగా నిలబడి గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి రెండు సార్లు కరీంనగర్ ఎంపీగా గెలిచారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా.. పీసీసీ అధ్యక్షుడిగా సత్యనారాయణ రావు పనిచేశారు. 2004లో చివరి సారి కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. దేవాదాయ శాఖను చూశారు. 2006లో కరీంనగర్ ఎంపీ స్తానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ పై నిలబడి ఓడిపోయారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై స్వల్ప తేడాతో ఓడిపోయారు. కేసీఆర్ ను ఓడించినంత పనిచేశారు.
గవర్నర్ కావాలన్న కోరిక ఎంఎస్ఆర్ కు బలంగా ఉండేది. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు.