రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపు ఆలస్య రుసుములు ఉండవని ఆమె స్పష్టం చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్‌ల దాఖలుకు 2020, జూన్ 30 వరకు గడువు విధించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుము 12 నుంచి 9 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఆధార్ – పాన్ అనుసంధానం గడువును కూడా జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
టీడీఎస్ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9 శాతానికి తగ్గించారు. రూ. 5 కోట్ల టర్నోవర్ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివాద్ సే విశ్వాస్ పథకం గడువు జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగించారు. మార్చి, ఏప్రిల్, మే జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్ 30 వరకు పొడిగించారు.
కాంపొజిషన్ స్కీమ్ రిటర్న్‌ల దాఖలుకు కూడా జూన్ 30 గడువు విధించారు. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం ఉండవని వెల్లడించారు. రూ. 5 కోట్ల టర్నోవర్ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.
డెబిట్ కార్డుదారులు ఇక నుంచి ఇతర ఏటీఎంల నుంచి ఎన్నిసార్లు అయినా నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ అవకాశం వచ్చే మూడు నెలల దాకా అందుబాటులో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వను ఉంచాలనే అంశంలో ఎలాంటి నియంత్రణ ఉండదు. ఇకపై బ్యాంకింగ్ ఛార్జీలను కూడా తగ్గిస్తారు.