DD News: దూరదర్శన్ నూ వదలని బిజెపి

కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో చేసిందా? లేకుంటే దూరదర్శన్ అధికారుల అత్యుత్సాహమా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే దూరదర్శన్ లోగోను కుంకుమ రంగులోకి మార్చాలని నిర్ణయించడంపై కేంద్రంలోని బిజెపి సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Written By: Dharma, Updated On : April 19, 2024 9:43 am

DD News

Follow us on

DD News: దూరదర్శన్.. దీనికి ఓ బ్రాండ్ ఉంది. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే కనిపించేవి..వినిపించేవి. టీవీ మాధ్యమాల్లో ప్రైవేటు ఛానళ్ల ప్రవేశంతో దూరదర్శన్ ప్రాభవం తగ్గింది. అయినా సరే ఇప్పటికీ.. దూరదర్శన్ కు ప్రత్యేక వీక్షకులు ఉన్నారు. దూరదర్శన్ న్యూస్ లో అధికార పార్టీకి పెద్దపీట వేస్తున్నారు అన్న విమర్శల నేపథ్యంలో.. ఇప్పుడు దాని లోగో కాషాయం రంగులోకి మారడం విమర్శలకు తావిస్తోంది.కేంద్ర ప్రభుత్వం పట్ల దూరదర్శన్ స్వామి భక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. వార్తలను ప్రసారం చేసే దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగోను, న్యూస్ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి మార్చడం విశేషం.

అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో చేసిందా? లేకుంటే దూరదర్శన్ అధికారుల అత్యుత్సాహమా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే దూరదర్శన్ లోగోను కుంకుమ రంగులోకి మార్చాలని నిర్ణయించడంపై కేంద్రంలోని బిజెపి సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడం పై విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అశేష ప్రేక్షకాదరణ పొందిన దూరదర్శన్ ను కాషాయకరణ చేయాలన్న ప్రయత్నంపై ముప్పేట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా దూరదర్శన్ వార్తలు, కార్యక్రమాలను ప్రసారం చేస్తుందని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్న తరుణంలో.. లోగో రంగు మార్చడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై దూరదర్శన్ మాజీ సీఈవో జవహర్ సర్కార్ తీవ్రంగా విమర్శించారు. దూరదర్శన్ ప్రసార భారతి కాదు.. అది ప్రచార భారతి గా మారింది అంటూ సెటైర్ వేశారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయి అన్న విమర్శ ఉంది. భారత్ వెలిగిపోతోంది అన్న బిజెపి మాటలను విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి.. భారత్ అభివృద్ధి చెందుతోందని చెప్పడం సహేతుకం కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు సైతం రంగు మార్చనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కాషాయ రంగులోకి మారనున్నట్లు సమాచారం. ఎన్నికలవేళ బిజెపి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా దూరదర్శన్ విషయంలో పాత లోగోను మార్చితే.. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.