Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ మూత దిశగా అడుగులు వేస్తోందా? త్వరలో మూతపడనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్లాంట్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో అనుమానం బలపడుతోంది. సరిగ్గా ఎన్నికలవేళ ఇలా జరుగుతుండడంపై కార్మిక వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. గత కొద్ది రోజులుగా విశాఖ స్టీల్ ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయగా.. కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాష్ట్రంలో అధికార వైసిపి తో పాటు విపక్షాలు సైతం పోరాటం చేశాయి. అయితే ఎవరి అవసరాలు వారికి ఉండడంతో చిత్తశుద్ధి ప్రదర్శించలేకపోయావన్న విమర్శ ఉంది.
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. రోజుకు దాదాపుగా 16 వేల నుంచి 18 వేల టన్నుల ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్లో.. ప్రస్తుతం ఆరు టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. ప్లాంట్ కి రోజుకు తొమ్మిది వేల టన్నుల కోకింగ్ ఓవెన్ అవసరం. కానీ కేవలం నాలుగు వేల టన్నులతోనే ప్రస్తుతం నడుపుతున్నారు. అటు బ్యాటరీలు సైతం డౌన్ అవుతున్నాయి. ఉక్కులో ఇందనంగా ఉపయోగించే కు గ్యాస్ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే ఈ పరిణామాలన్నీ కార్మికులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని అనుమానిస్తున్నారు.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. విద్యుత్ శాఖకు ప్లాంట్ 100 కోట్ల వరకు బకాయిలు పడింది. తక్షణం ఆ బకాయిలను చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో కార్మిక వర్గాలతో పాటు ఉద్యోగుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధి ప్రదర్శించుకునే సమయం ఆసన్నమైందని.. తక్షణం అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని వారు కోరుతున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ పార్టీలన్నీ మౌనం దాల్చాయి. అటు అధికారపక్షంగా ఉన్న వైసిపి బిజెపితో టిడిపి కలవడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. తాను ఒక అధికారపక్షమని గుర్తు లేకుండా వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని భావిస్తోంది. భాగస్వామ్య పక్షమైనందుకు టిడిపి దీనిపై బిజెపిని నిలదీయాలని డిమాండ్ చేస్తోంది. మొత్తానికైతే ఎన్నికల ముంగిట స్టీల్ ప్లాంట్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.