
Dastagiri: అతను వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు. హత్యలో ప్రధాన పాత్రదారుడు. ఒకప్పుడు వైఎస్ వివేకానందరెడ్డికి విశ్వాసపాత్రుడు. విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడు. తాగిన మైకంలో చేసిన తప్పు తెలుసుకున్నాడు. కేసులో అప్రూవర్ గా మారాడు. నిందితులను తేల్చడానికి సీబీఐ చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తున్నాడు. ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ పార్టీలో తెలియని గుబులు పుట్టిస్తున్నాయి. ఇంతకీ అతనెవరు ? ఆ వ్యాఖ్యలేంటో తెలుసుకోండి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో షేక్ దస్తగిరి ప్రధాన పాత్రధారుడు. హత్య జరిగిన సమయంలో వివేకా ఇంట్లోనే ఉన్నాడు. నమ్మకస్తుడు కావడంతో వివేకా ఇంట్లోకి రానిచ్చాడు. మిగిలిన వారితో కలిసి వివేకాను పాశవికంగా హత్య చేశాడు. కానీ తాగిన మైకంలో చేసిన తప్పును తెలుసుకున్నాడు. హత్య కేసు వెనుక బలమైన శక్తులు ఉన్నా భయపడకుండా నిజాలను బహిర్గతపరిచేందుకు సిద్ధమయ్యాడు. కేసులో అప్రూవర్ గా మారిపోయాడు. సీబీఐకు తనకున్న సమాచారాన్ని ఇప్పటికే అందించాడు. దస్తగిరి సమాచారం మేరకు సీబీఐ అధికారులు కేసును ముందుకు తీసుకెళ్తున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు హైదరాబాద్ కు మార్చడంతో సమన్లు తీసుకునేందుకు దస్తగిరి ఆదివారం సీబీఐ కార్యాలయానికి వచ్చాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏపీ సీఎం జగన్ కేసులోని దోషుల్ని తేల్చాలనుకుంటే పది రోజులకు మించి సమయం పట్టదన్నాడు. సీబీఐ అధికారులు వారి వద్ద ఉన్న సమాచారం మేరకే అనుమానితుల్ని విచారిస్తున్నారని తెలిపాడు. సమాచారం లేకుండా ఎవరినీ ఊరికనే విచారించరని చెప్పాడు. త్వరలో నిజానిజాలు బయటపడతాయన్నాడు. కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావడం మంచిదని అన్నాడు. కేసులో ఎవరి పాత్ర ఏంటనేది కాల్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు తేల్చుతారని చెప్పాడు.

ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని, జగన్ ఓఎస్డీ కృష్ణమోహనరెడ్డిని, భారతీ పీఏ నవీన్ ను సీబీఐ అధికారులు విచారించారు. వీరి తర్వాత మరికొంత మంది కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు విచారణకు పిలుస్తారని చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఉన్నతస్థాయి వ్యక్తులు కూడా త్వరలో విచారణకు వెళ్లాల్సి వస్తోందని తెలుస్తోంది. దీంతో వైసీపీలో వణుకుపుడుతోంది. షేక్ దస్తగరి వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే సీబీఐ ఏమేరకు కేసును వేగవంతంగా ముందుకు తీసుకెళ్తుంది అనే అంశం పై కేసు పురోగతి ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నా వ్యక్తులు ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. కేసులో విచారణకు నోటీసులు రాగానే ఢిల్లీ వైపు పరుగెత్తడం ఇందుకేనని ప్రచారం జరుగుతోంది. తప్పు చేయని వారు విచారణకు సహకరిస్తే సొమ్మేం పోతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తప్పు చేసినవారే భుజాలు తడుముకుంటారని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో ఉంది. మరి ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో కేసు ఆలస్యం అవుతుందా ? నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా ? అన్న చర్చ ఏపీలో జరుగుతోంది.