BJP-TRS: నువ్వు గిచ్చినట్టు చేయ్. నేను ఏడ్చినట్టు చేస్తా. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే జరుగుతున్నది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య ఇదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది.. కేసుల్లో క్విడ్ ప్రో కో ఉన్నట్టే… రాజకీయాల్లో కూడా నీకు నేను.. నాకు నువ్వు.. అనేది సాగుతూ ఉంటుంది.. 70 ఏళ్ల ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఇప్పటివరకు ఇలాంటి స్టోరీలు ప్రజలు చాలా చూసే ఉన్నారు. కానీ నాయకులే ప్రజలకు ఏమాత్రం మొనాటానీ రాకుండా రకరకాల పాత్రలతో మెప్పిస్తున్నారు. సాధారణంగా ఒక డీల్ వ్యవహారంలో ఉభయ పక్షాలు పరస్పర ప్రయోజనాలు కలిగించుకుంటాయి. ఇందులో మూడో కంటికి అనుమానాలు రాకుండా మసులుకుంటాయి. దానివల్ల వారిద్దరికీ ప్రయోజనం ఉంటుంది.. మూడో వ్యక్తి వేలెత్తి చూపే అవకాశం ఉండదు.

చీకటి ఒప్పందం నడుస్తోందా
2018 వరకు భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క మాట అన్నది కూడా లేదు.. పైగా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు కూడా తన ఆమోదం తెలిపింది. మెట్రో రైలు ప్రారంభానికి, మిషన్ భగీరథ నీళ్ళ ప్రారంభానికి పిలిచింది. తర్వాత పలు సందర్భాల్లో మోడీ లాంటి అవినీతి రహిత నాయకుడిని నేను ఇప్పటివరకు చూడలేదని సాక్షాత్తు కెసిఆర్ ప్రశంసించారు. వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ వెళ్లి వంగి వంగి నమస్కారాలు పెట్టారు. ఎప్పుడైతే నిజామాబాదులో బిడ్డ ఓడిపోయిందో అప్పుడే స్వరం మారింది. దూషణలో కొత్త తరహా నిలదీత మొదలైంది. కానీ అందరూ అనుకున్నట్టు ఇది యుద్ధమేనా? లేకుంటే యుద్ధం పేరుతో నెరిపే సంధి కార్యమా? తెలంగాణ రాజకీయాలు గమనించినప్పుడు బద్ధ శత్రువులే అయినప్పటికీ బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య క్విడ్ ప్రో కో కుదిరే అవకాశం కనిపిస్తోంది.
కేసులతో హడావుడి
మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం బిజెపి పెద్ద తలకాయ బిఎల్ సంతోష్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. ఆయన విచారణకు రాకపోవడంతో గులాబీ మీడియా రచ్చ రచ్చ చేస్తోంది. అయితే సిట్ ఇచ్చిన నోటీసులను రాష్ట్ర హైకోర్టు కూడా తప్పుపడుతూ ఉండడం గమనార్హం. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పకడ్బందీగా వ్యవహరించిన కేసీఆర్.. మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో మాత్రం అంత పట్టు చూపలేకపోయారు. దీనిని బట్టి నేను గర్జిస్తా.. నువ్వూ గర్జించు… మధ్యలో మూడో వాడికి స్థానం లేదు.. ఉండకూడదు అనే సంకేతాలు ఇచ్చారు.. కానీ వీటిని అర్థం చేసుకోలేనంత అమాయకులు ప్రజలు కాదు.

కవిత పేరు ఇప్పుడు..
ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ప్రమేయం ఉన్నట్టు రెండు నెలల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లీకులు ఇచ్చింది. కాని తీరా చూస్తే మొన్నటిదాకా ఆమె పేరు లేదు. తర్వాత ఏమైందో కానీ నిన్న ఆరోరాను అరెస్టు చేసిన తర్వాత…ఛార్జ్ షీట్ లో కవిత పేరు ప్రత్యక్షమైంది. చివరిదాకా ఈ పేరు ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే…మనీష్ సిసోడియా పేరు మొన్నటి దాకా ప్రచారంలో ఉంది.. ఇప్పుడు ఆయన పేరు కూడా ఉండేది లేనిది అనుమానంగా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి కేసు కూడా కొద్ది సంవత్సరాలపాటు మీడియాలో ప్రముఖంగా నానింది. తర్వాత యధావిధిగా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది.. ఈ కేసు కూడా అంతే. కొద్దిరోజులు మీడియా వారికి బ్రేకింగ్ న్యూస్. తర్వాత పాలకు పాలు. నీళ్లకు నీళ్ళు. మధ్యలో ప్రజలే వెర్రివాళ్లు.