Jagan – Reddy Community: ఏపీలో వైసీపీ బిగ్ సౌండ్ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ బలం తగ్గలేదని నిరూపించుకోడానికి తెగ ఆరాటపడుతోంది. అందుకే ఇతర పార్టీ నేతల ఎంట్రీకి చాన్స్ ఇచ్చింది. ఇప్పటివరకూ వస్తామన్న నాయకులకు అడ్డుకట్ట వేయగా… ఇప్పుడు రండి చేర్చుకుంటామని కబురు పెడుతున్నారు. అయితే ఇన్నాళ్లయితే అధికారం ఉంది కదా అని ఆసక్తి చూపించిన నేతలు ఇప్పుడు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఉన్నది ఒక్క ఏడాది.. అందునా ఇప్పుడు పార్టీలో ఉన్నవారికే పెద్ద గుర్తింపు లేదు. ఇప్పుడు వెళ్లినా వేస్ట్ అని చాలామంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాయలసీమలో టీడీపీ బలం పెంచుకుంటోందని.. జనసేన ప్రభావం కూడా పెరిగిందన్న వార్తల నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ అప్రమత్తమైంది. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంలో గతంలో మాదిరిగా కేస్ట్ ఫీలింగ్ తగ్గిందని.. గతంలోలాగా జగన్ కు ఓన్ చేసుకోవడం లేదని నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి చేరింది. దీంతో రాయసీమలో వైసీపీలో చేరికలకు తెరతీశారు. మదనపల్లె మీటింగ్ కు వెళ్లిన జగన్ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిని పిలిచి మరీ కండువా కప్పేశారు.

వైసీపీలో ఉన్న చాలా మంది రెడ్డి సామాజికవర్గం నేతలు అసంతృప్తితో ఉన్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఆశించిన పదవి దక్కలేదని కొందరు.. పదవి ఉన్నా పవర్ లేదని కొందరు,..తమ ప్రత్యర్థికి ప్రాధాన్యమిస్తున్నారని మరికొందరు.. ఇలా చెప్పుకుంటూ పోతే అధికార పార్టీలో అసంతృప్త నేతల జాబితా చాంతాడంత ఉంది. కర్నూలు జిల్లాకు చెందిన యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న టాక్ ఎప్పటి నుంచో నడుస్తోంది. చంద్రబాబు, లోకేష్ తో భేటీ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ముక్తసరిగా ఖండించిన సిద్దార్థ్ రెడ్డి పై కూడా హైకమాండ్ కు అనుమానం అయితే ఉంది. ప్రస్తుతానికి శాప్ చైర్మన్ పదవి కట్టబెట్టి కట్టడి చేశారు. కానీ ఎన్నికల నాటికి ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్ కు అత్యంత సన్నిహితుడు, ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం హైకమాండ్ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తనను రాజకీయంగా డిమోషన్.. పార్టీలో తన ప్రత్యర్థి అయిన వైవీ సుబ్బారెడ్డికి ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇస్తుండడం ఆయనకు మింగుడుపడడం లేదు. పైగా తనకు మంత్రి పదవి ఊడిపోవడానికి, ప్రకాశం జిల్లాలో తన ఆధిపత్యానికి గండిపడడానికి వైవీ సుబ్బారెడ్డే కారణమని బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తీరుపై హైకమాండ్ కు ఫిర్యాదుచేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. పైగా పార్టీలో బాలినేని పరిధి తగ్గిస్తూ వచ్చారు. దీంతో జగన్ తో పాటు వైసీపీ పెద్దల తీరుపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందన్న ప్రచారం ఊపందుకుంది.

నెల్లూరు పెద్దారెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కూడా పార్టీ పట్ల ఏమంతా అనుకూలంగా లేరు. తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కకపోవడంతో ఆయన అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. విస్తరణ లో సైతం జగన్ ముఖం చాటేయ్యడంతో వైసీపీలో ఉండడం వేస్టాన్న డిసైడ్ కు వచ్చారు. అందుకే తన కుమార్తెను చంద్రబాబు, లోకేష్ ల వద్దకు పంపించి పార్టీ హైకమాండ్ కు నేరుగా సంకేతాలు పంపించారు. అటు అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు కాకాని గోవర్థన్ రెడ్డిలకు మంత్రి పదవులిచ్చి.. తనపై జగన్ ఊసిగొల్పడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే ఈ పాటికే ఆనం ఫ్యామిలీ ఏకతాటిపైకి వచ్చారని.. ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఇప్పటివరకూ జగన్ అంటే రెడ్డి సామాజికవర్గం.. రెడ్డి సామాజికవర్గం అంటే జగన్ అన్న రేంజ్ లో బంధం కొనసాగింది. గత ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గంలో 80 శాతం మంది వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. హార్ట్ ఫుల్ గా వర్క్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రెడ్డి సామాజికవర్గాన్ని పట్టించుకోలేదన్న టాక్ నడుస్తోంది. పార్టీతో పాటు నామినేట్ పోస్టుల్లో కీలక పదవులిచ్చినా.. సామాజికవర్గపరంగా రాజకీయాలతో సంబంధం లేని వారికి మాత్రం ఏమంత ప్రయోజనం లేకుండా పోయిందన్న టాక్ నడుస్తోంది.దీంతో వారిలో అసంతృప్తి గూడుకట్టుకుంది.పైగా ఆ నలుగురు రెడ్లకే కాంట్రాక్టులు, కమీషన్లు, పవర్, పదవులు అన్న ముద్రపడింది. అది మిగతా వారిలో అసంతృప్తికి కారణమవుతోంది, ఫలింతగా రెడ్డి సామాజికవర్గం నేతలు సంఘటితమవుతున్నారు. విపక్ష టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పర్యవసానాల ఫలితమే చంద్రబాబు కర్నూలు పర్యటనలో లక్షలాది మంది జనాభా అని జగన్ కు నిఘా వర్గాలు ఉప్పందించాయి. దీంతో మేల్కొన్న జగన్ తమకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదని.. ఇప్పటికీ బలంగా ఉన్నామని చెప్పుకునేందుకు విపక్షాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులను ఆకర్షించే పనిలో ఉన్నారు.