
Family Doctor Programme: ప్రభుత్వం ఏదైనా అధికారిక కార్యక్రమం నిర్వహిస్తే.. ఆ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటారు. వేదిక ఏర్పాటు, వేదికపై కూర్చునేవారు, జన సేకరణ, తరలింపు.. అన్నీ వారి బాధ్యతే. ఇక ప్రభుత్వ కార్యాక్రమంలో ప్రొటోకాల్, నివేదికల సమర్పణ, ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాట్లు తదితర పనులన్నీ జిల్లా కలెక్టర్ చూసుకుంటారు. అంటే అధికారిక కార్యక్రమంలో మంత్రికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, కలెక్టర్‌కు అంతే ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఏపీలో మాత్రం మంత్రులు, అధికార పార్టీ నాయకులకు ఉన్న ప్రాముఖ్యత కూడా కలెక్టర్‌కు దక్కడం లేదు. ఇందుకు తాజాగా పట్నాడులో జరిగిన అధికారిక కార్యక్రమమే ఇందుకు నిదర్శనం. మంత్రి, డాక్టర్లను తన పక్కన కూర్చోబెట్టుకున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను మాత్రం ఓ మూలన నిలబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం..
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ‘ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం’ ప్రారంభించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. కలెక్టర్ శివశంకర్ లోతేటి ఈ కార్యక్రమ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మంత్రి విడదల రజిని, కార్యక్రమం ప్రారంభం అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రాముఖ్యతను గొప్పగా చెప్పారు. దేశంలో అందనూ తమ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కాపీ కొడతారని పేర్కొన్నారు.
ఫొటో షూట్‌లో కలెక్టర్‌కు లేని సీటు..
కార్యక్రమం అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు, వైద్య సిబ్బంది, జిల్లా వైద్యాధికారితోపాటు మంత్రి విడదల రజిని సీఎం జగన్‌తో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం మొత్తం ఆర్గనైజ్ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటికి మాత్రం సీటు లేదు. అందరికీ కుర్చీలు వేయించిన సీఎం జగన్, మంత్రి రజిని, కలెక్టర్‌ను మాత్రం పక్కన నిలబెట్టారు. దళితుడు కావడమే నేరమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పాపం సదరు కలెక్టర్‌గారు కూడా ఏమీ నొచ్చుకోకుండా, అలా నిలబడి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
జగన్ తీరుపై విమర్శలు..
ఐఏఎస్ అంటే దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ అధికారి. ఆయనను ప్రభుత్వ సేవలకు వినియోగించుకోవాలేగానీ, బానిసలా చూడడం ఏంటన్న ప్రశ్న తెలెత్తుతోంది. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హాజరైన కార్యక్రమంలో ఓ దళిత కలెక్టర్‌కు సీటు వేయకపోవడం ఏంటని అధికారుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విపక్షాలు కూడా సీఎం తీరును తప్పుపడుతున్నాయి. అధికారులకు ఏపీ సర్కార్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు.

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ పాలనపై గుర్రుగా ఉన్నారు. వేతనాల పెంపుతోపాటు ఇతర విషయాల్లో ప్రభుత్వం, సీఎం తీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడు కలెక్టర్‌ను సభా వేదికపై అవమానించడం ఇప్పుడు ఉద్యోగుల్లోనూ చర్చనీయాంశమైంది. మరి ఏపీ సర్కార్ దీనికి ఏమని వివరణ ఇస్తుందో చూడాలి.