Actor Vijay TVK Rally : అచ్చం జగన్ లాగానే.. సిద్ధం సభలను గుర్తు చేస్తున్న విజయ్ పార్టీ ర్యాలీలు

పెన్సిల్ రంగ్ ప్యాంట్.. వైట్ షర్ట్.. మీడియం స్థాయి కంటే తక్కువ గడ్డం. అదే స్థాయిలో జుట్టు. మొత్తంగా చూస్తే మాస్ క్లాస్ కలబోతతో ఆహార్యం.. ఇదీ ఆదివారం నాటి విల్లుపురం సమీపంలో తమిళగ వెట్రి కళగం పార్టీ మహానాడు సభలో.. దాని వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు విజయ్ కనిపించిన తీరు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 27, 2024 10:07 pm
Follow us on

Actor Vijay TVK Rally : అక్కడి వాతావరణం.. సభ నిర్వహించిన తీరు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను గుర్తు చేశాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే విజయ్ కూడా అలాంటి డ్రెస్సే ధరించారు. వేదికలు కూడా అలానే నిర్మించారు. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఆ సభలకు వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశాయి. ఆ వేదిక విభిన్నంగా ఉండేది. సహజంగా రాజకీయ పార్టీల సభలు అంటే వేదికలు భారీగా ఉంటాయి. వేదిక మీద కూర్చున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ సిద్ధం సభలు ఇందుకు పూర్తి భిన్నం. ఎందుకంటే పొడవైన ర్యాంపు నిర్మించేవారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ ప్రసంగించేవారు. మిగతా నాయకులు ఆయనకు వెనకాల కూర్చునేవారు. వారి సమయం వచ్చినప్పుడు అక్కడ నుంచి ప్రసంగించేవారు. సేమ్ సిద్ధం సభల్లాగానే విజయ్ కూడా తన మహానాడు సభను నిర్వహించారు.

సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వైసీపీ శ్రేణులు

ఆదివారం నాటి తమిళగ వెట్రి కళగం నిర్వహించిన మహానాడు విజయవంతమైంది. విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మొత్తంగా రెండు లక్షల మంది దాకా ఈ సభకు వచ్చారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజయ్ కనిపించిన తీరు అచ్చం సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డిని పోలి ఉంది. దీంతో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విజయ్, జగన్మోహన్ రెడ్డిని పోల్చి ప్రచారం చేస్తున్నారు. ” 2019లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి విషయం లోనూ ఏపీ ప్రయోజనాలను గుర్తుచేస్తూ ప్రసంగించారు. నాడు అధికారంలో ఉన్న టిడిపి తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.. ముఖ్యంగా ఆంధ్ర అనే సెంటిమెంట్ ను ప్రజల్లో రగిలించారు. అన్నింటికీ మించి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలను కోరారు. ఆయన మాట తీరుకు.. ప్రసంగించిన తీరుకు ప్రజలు ఆశీర్వదించారు.. నాటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటన చేశారు. ఆయన దూకుడు అప్పటి అధికార పార్టీ టిడిపిని మట్టికరిపించింది..151 అసెంబ్లీ సీట్లు వైసిపి గెలుచుకుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ లేని సంచలనం సృష్టించింది. ఇప్పుడు విజయ్ కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే కనిపిస్తున్నారు. అలానే మాట్లాడుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే సునామి సృష్టించబోతున్నారని” వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.