Daggubati Purandeswari: బిజెపిలో ఒంటరైన పురందేశ్వరి

ఇటీవల ఏపీలో మద్యం పేరుతో కుంభకోణం జరుగుతోందని పురందేశ్వరి ఆరోపించారు. గణాంకాలతో సహా వెల్లడించారు. ఏటా 36,700 కోట్ల రూపాయలు పక్కదారి పడుతోందని ఆరోపించారు.

Written By: Dharma, Updated On : September 21, 2023 11:03 am

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పార్టీలో ఒంటరి అయ్యారు. ఆమెకు అండగా నిలిచే నేతలు కరువయ్యారు. అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అదే స్థాయిలో వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పరిణామ క్రమంలో ఆమెకు అండగా నిలవాల్సిన బిజెపి నాయకులు సైలెంట్ గా ఉన్నారు. కనీస స్థాయిలో కూడా ఆమెకు అండగా నిలబడడం లేదు. దీంతో పురందేశ్వరి దాదాపు పార్టీలో ఒంటరి అయ్యారు అన్న టాక్ ప్రారంభమైంది. ముఖ్యంగా వైసీపీ అక్రమాలని ఆమె ఖండిస్తున్నారు. ఖండిస్తూ కీలక ప్రకటనలు చేస్తున్నారు. వాటిని సమర్థించేందుకు సైతం బిజెపి నేతలు ముందుకు రాకపోవడం విశేషం.

పురందేశ్వరికి ఏపీ బీజేపీ బాధ్యతలు అనూహ్యంగా వరించాయి. ఆమె పోటీ పడకపోయినా హై కమాండ్ గుర్తించి అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. సీనియర్ నేత కావడం, ఆపై దూకుడు స్వభావం ఉండడంతో తెలంగాణ మాదిరిగా పార్టీ కార్యకలాపాలు ఊపందుకుంటాయని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే పురందేశ్వరి దూకుడు కనబరిచారు. కానీ ఎందుకో తర్వాత తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు అన్న ప్రచారం ప్రారంభమైంది. తన సొంత టీమ్ ను సైతం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర బిజెపి దూసుకుపోతుందని భావించారు. కానీ ఆ స్థాయిలో కార్యకలాపాలేవీ ప్రారంభం కాలేదు. కానీ పురందేశ్వరి మాత్రం జగన్ సర్కార్ పై గట్టిగానే కౌంటర్ అటాక్ ప్రారంభించారు. కానీ ఆమెను అనుసరించే వారు కరువయ్యారు.

ఇటీవల ఏపీలో మద్యం పేరుతో కుంభకోణం జరుగుతోందని పురందేశ్వరి ఆరోపించారు. గణాంకాలతో సహా వెల్లడించారు. ఏటా 36,700 కోట్ల రూపాయలు పక్కదారి పడుతోందని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమె వ్యాఖ్యలను సమర్థించలేదు. సోము వీర్రాజు నుంచి జీవీఎల్ నరసింహారావు వరకు ఎవరు నోరు మెదపడం లేదు. చివరకు విజయ సాయి రెడ్డి లాంటి నేతలు పురందేశ్వరిని టార్గెట్ చేసినా మిగతా నేతలు స్పందించకపోవడం విశేషం.

గతంలో జివిఎల్ నరసింహారావు యాక్టివ్ గా ఉండేవారు. వారానికి ఒకసారి విశాఖ వచ్చేవారు. ప్రెస్ మీట్ లు పెట్టి పార్టీ అభిప్రాయాలను వెల్లడించేవారు. కానీ పురందేశ్వరి అధ్యక్షురాలు అయ్యాక జివిఎల్ వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. అటు సత్య కుమార్ లాంటి నేతలు కూడా ఏపీ రాజకీయాలపై మాట్లాడడం మానేశారు. అయితే పురందేశ్వరి వ్యవహార శైలి కారణంగానే ఏపీ బీజేపీ నాయకులు మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు పార్టీ కార్యక్రమాలకు సైతం మొఖం చాటేస్తున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవ పక్వాడా కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర నాయకత్వం ఆదేశించినా.. ఎక్కడా చేసిన దాఖలాలు కనిపించలేదు. ఏపీ బీజేపీ అంటే ఒక్క పురందేశ్వరే అనేలా పరిస్థితి మారిపోయింది.