Janasena Glass Symbol: గాజు గ్లాస్ అంటే గుర్తుకొచ్చేది జనసేన పార్టీ. గత ఎన్నికల్లో ఆ సింబల్ తోనే పోటీ చేశారు ఆ పార్టీ అభ్యర్థులు. కానీ ఈసీ నిబంధనలు మేరకు ఓట్లు,సీట్లు తెచ్చుకోలేకపోయారు. దీంతో ఈసీ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ లో చేర్చింది. దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంది. గుర్తు కోల్పోయిన పార్టీ అంటూ ఎద్దేవా చేసింది.ఇక జనసేన అభ్యర్థులు నియోజకవర్గానికి ఒక గుర్తు పొందాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.సోషల్ మీడియాలో అయితే వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే తాజాగా ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాస్ గుర్తును జనసేనకు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జనసైనికులు ఖుషి అవుతున్నారు. నాటి వైసిపి మాటలను గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు ట్రోల్ అవుతున్నాయి. జనసేనకు గాజు గ్లాస్ గుర్తొచ్చింది.. ఇక పని చేసుకోండి రా సోంబేరులు అంటూ జన సైనికుడు పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటుంది. సగటు జనసేన అభిమాని అభిమానాన్ని, అభిమతాన్ని చాటుతోంది. దీనిపై నెటిజెన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. గుర్తుతో మాకు పని ఏంటి? మాకు పవనే సింబల్ అని తేల్చి చెబుతున్నారు. అయినా సరే చట్టపరంగా వెళ్లి తమ గాజు గ్లాస్ గుర్తును పదిలం చేసుకున్నామని గుర్తు చేసుకుంటున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో ఏడు లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేసింది. గాజు గ్లాస్ గుర్తుతోనే బరిలో దిగింది. ఓట్ల పరంగా పర్వాలేదనిపించుకున్నా.. సీట్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. అప్పటి నుంచే జనసేన చుట్టూ కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. అసలు జనసేనకు పార్టీ గుర్తే లేకుండా చేయాలని ప్రత్యర్థులు పావులు కదిపారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో.. జనసేన నుంచి ఆ పార్టీ గుర్తును దూరం చేయాలని పావులు కదిపారు. ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా ప్రకటించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అదే గుర్తును జనసేనకు రిజర్వ్ చేయడంతో.. వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది.