తెలుగు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు తుపాను ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశా లోని గోపాలపూర్ మధ్య ఈ నెల 26న తీరం దాటే అవకాశముందని తెలుస్తోంది. దీంతో దీనికి పాకిస్తాన్ గులాబ్ అనే పేరు పెట్టింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి శుక్రవారం వాయుగుండంగా మారింది. దీంతో సాయంత్రం 5.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతోంది. గోపాల్ పూర్ కు ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కళింగపట్నానికి తూర్పుగా 740 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు చెబుతోంది.
శనివారం ఉదయానికి తుపానుగా మారి ఏపీలోని కోస్తా, ఒడిశాలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. 26న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చు. తెలంగాణ, చత్తీస్ గడ్ లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
27న చత్తీస్ గడ్, ఒడిశా, తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల మధ్య గాలులు వీచే వీలుంది. 27 వరకు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచిస్తున్నారు.