Cybercrime SI : కంచె చేను మేసింది. బాధ్యతగా ఉండాల్సిన అధికారి గాడి తప్పాడు. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడి అసలు విలువలను మర్చిపోయాడు. పైగా ఖాకి చొక్కా వేసుకొని ఫక్తు ఒక నేరస్తుడిగా మారిపోయాడు. చివరికి ఒక పోలీసు అధికారి అయ్యుండి తోటి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నేరస్తులను కటకటాల పాలు చేయాల్సిన అధికారి తాను జైలుకు వెళ్ళాడు. సభ్య సమాజం ముందు తలవంచుకొని నిలుచున్నాడు. గతంలో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయినా.. అతడి బుద్ధి మారలేదు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజేందర్ అనే ఎస్ఐ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఓ కేసు విచారణకు సంబంధించి తన బృందంతో కలిసి మహారాష్ట్రలోని ముంబై వెళ్లాడు. అక్కడ సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియా వ్యక్తిని పట్టుకున్నాడు. అతని వద్ద 1750 గ్రాముల నిషేధిత డ్రగ్స్ ను రాజేందర్ స్వాధీనం చేసుకున్నాడు.. అయితే ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాడు. కనీసం ఆ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులకు తెలపలేదు. పైగా డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్లో 80 లక్షలకు పైగా ఉంటుంది. ఇదే అతడిలో దుర్బుద్ధి పుట్టించింది. ఆ డ్రగ్స్ ద్వారా తన జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్నాడు. ఇదే అదునుగా తనలోని పోలీసును పక్కన పెట్టేసి నేరస్తుడిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ డ్రగ్స్ ను తన ఇంట్లో నిల్వచేసి అమ్మేందుకు యత్నిస్తున్నాడు.
నైజీరియా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పుడు రాజేందర్ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు స్టేట్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సమాచారం అందింది.. దీనిపై లోతుగా విచారణ చేయడం ప్రారంభించింది. ఆ డిపార్ట్మెంట్ అనుమానం నిజం కావడంతో రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించింది. స్టేట్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అందించిన సమాచారం మేరకు రాయదుర్గం పోలీసులు రాజేందర్ ఇంటి పై దాడి చేశారు. అతడు తన ఇంట్లో దాచిన 1750 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాజేందర్ ఆది నుంచి వివాదాస్పదమైన పోలీస్. గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడంతో సస్పెండ్ అయ్యాడు. తర్వాత హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. కొన్ని సైబర్ నేరాలు చేదించినందుకు గాను బాధితుల వద్ద డబ్బు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సైబరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతీ కేసును డీల్ చేసి ఆమెను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా సైబర్ క్రైమ్ కేసును చేదించి.. ఆ నేరానికి పాల్పడుతున్న నైజీరియా వ్యక్తి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నాడు. వాటిని బయట విక్రయించేందుకు ఇంట్లో భద్రపరిచాడు. పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడంతో అతడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.