https://oktelugu.com/

Mukesh Ambani : హోటల్ బిజినెస్ లోకి ముకేశ్ అంబానీ.. దీనివెనుక పెద్ద స్కెచ్

గతంలో తమ సాయం అందుకున్న ఒబెరాయ్‌ గ్రూప్‌తో సంయుక్తంగా హోటళ్ల నిర్వహణ ద్వారా అనుభవం గడించాక రిలయన్స్‌ సొంతంగా ఈ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2023 / 06:32 PM IST

    ambani-newyork

    Follow us on

    Mukesh Ambani : దేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ తన వ్యాపారాన్ని క్రమం గా కొత్త రంగాల్లోకి విస్తరింపజేస్తూ వస్తున్నారు. కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఆయిల్‌ అండ్‌ కెమికల్‌ నుంచి టెలికాం, రిటైల్‌, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లోకీ ప్రవేశించిన ఆర్‌ఐఎల్‌.. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ద్వారా తాజాగా ఆర్థిక సేవల విభాగంలోకి అడుగుపెట్టారు. త్వరలో హోటళ్ల వ్యాపారంలోకీ ఎంట్రీ ఇచ్చే దిశగా అంబానీ అడుగులు వేస్తున్నారు. భారత్‌, యూకేలోని మూడు ప్రాజెక్టుల సంయుక్త నిర్వహణకు ఒబెరాయ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ (ఒబెరాయ్‌ గ్రూప్‌)తో అవగాహన కుదుర్చుకున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్న అనంత్‌ విలాస్‌ హోటల్‌, యూకేలోని స్టోక్‌ పార్క్‌తో పాటు గుజరాత్‌లో నిర్మిస్తున్న మరో ప్రాజెక్టు ఈ జాబితాలో ఉన్నాయి. చాలా కాలం క్రితమే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టినప్పటికీ, హోటళ్ల నిర్వహణలోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టడం ఇదే తొలిసారి.

    73 శాతం వాటా కొనుగోలు

    గత ఏడాది ముకేశ్‌ అంబానీ న్యూయార్క్‌లోని మాండరిన్‌ ఓరియంటల్‌ హోటల్‌ లో 73 శాతం వాటాను 10 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశారు. అంతక్రితం సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన ఐకానిక్‌ కంట్రీ క్లబ్‌, లగ్జరీ గోల్ఫ్‌ రిసార్ట్‌ ‘స్టోక్‌ పార్క్‌’ను 5.7 కోట్ల పౌండ్లకు దక్కించుకున్నారు. స్టోక్‌ పార్క్‌లో గోల్డ్‌ఫింగర్‌, టుమారో నెవ ర్‌ డైస్‌ వంటి జేమ్స్‌ బాండ్‌ సినిమాల చిత్రీకరణ జరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పూర్తి అనుబంధ విభాగమైన రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) దశాబ్ద కాలం ముందు నుంచే హోటళ్ల రంగంలో అడపాదడపా పెట్టుబడులు పెడుతూ వచ్చింది. 2010లో ఇది మొదలైంది. ఆ ఏడాది ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రధాన కంపెనీ ఈస్ట్‌ ఇండియా హోటల్స్‌ (ఈఐహెచ్‌) లిమిటెడ్‌లో 14.12 శాతం వాటాను ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ కొనుగోలు చేసింది. ఈఐహెచ్‌లో మరో వాటాదారైన ఐటీసీ లిమిటెడ్‌ బలవంతపు టేకోవర్‌కు పాల్పడకుండా ఉండేందుకు బిక్కీ ఒబెరాయ్‌ ముకేశ్‌ మద్దతు కోరుతూ తన కంపెనీలో స్వల్ప వాటాను రిలయన్స్‌కు విక్రయించారు.
    గతంలో తమ సాయం అందుకున్న ఒబెరాయ్‌ గ్రూప్‌తో సంయుక్తంగా హోటళ్ల నిర్వహణ ద్వారా అనుభవం గడించాక రిలయన్స్‌ సొంతంగా ఈ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. తద్వారా ఐటీసీ, టాటా గ్రూప్‌ హోటళ్ల వ్యాపారాలకు అంబానీ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని వారన్నారు.

    10 శాతం విక్రయించే అవకాశం

    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన రిటైల్‌ వ్యాపార విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో మరో 8-10 శాతం మేర వాటాలను విక్రయించవచ్చని ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. తద్వారా లభించే నిధులతో ఈ విభాగ వ్యాపారాన్ని మరింత విస్తరించడం, రుణ భారం తగ్గించడంతో పాటు భవిష్యత్‌లో రిటైల్‌ వ్యాపారాన్ని సైతం ప్రత్యేక సంస్థగా విభజించి స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేసే దిశగా అంబానీ పావులు కదుపుతున్నట్లు కథనం అభిప్రాయపడింది. ఈనెల 28న (సోమవారం) జరగనున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో అంబానీ ఈ అంశంపైనా సంకేతాలిచ్చే అవకాశాల్లేకపోలేవు. ఆర్‌ఆర్‌వీఎల్‌లో దాదాపు ఒక శాతం వాటాను ఖతార్‌ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ (క్యూఐఏ) రూ.8,278 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌ఐఎల్‌ ఈ వారంలో ప్రకటించింది. ఈ లావాదేవీలో భాగంగా రిలయన్స్‌ రిటైల్‌ మార్కెట్‌ విలువను రూ.8.278 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ముకేశ్‌ అంబానీ గతంలోనూ రిలయన్స్‌ రిటైల్‌లో వాటాలు విక్రయించారు. 2020లో సిల్వర్‌ లేక్‌, కేకేఆర్‌, ముబాదల, ఏడీఐఏ, జీఐసీ, టీపీజీ, జనరల్‌ అట్లాంటింక్‌, సౌదీ అరేబియా పబ్లిక్‌ ఇన్వెస్ట్మెంట్ వంటి గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) కంపెనీలకు మొత్తం 10.09 శాతం వాటాల విక్రయం ద్వారా రూ.47,265 కోట్లు సమీకరించారు. ఆ సమయంలో కంపెనీ మార్కెట్‌ విలువను రూ.4.2 లక్షల కోట్ల స్థాయిలో లెక్కగట్టారు.