https://oktelugu.com/

CWC Meeting In Hyderabad: యాట కూర, బగారా అన్నం.. సీడబ్ల్యూసీ మెనూ మామూలుగా లేదు

పెద్ద పెద్ద నేతలు మొత్తం వస్తున్న నేపథ్యంలో భారీగా మెనూ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.. ఏకంగా 126 రకాల వంటకాలను అతిధులకు వడ్డించనున్నట్టు సమాచారం.

Written By: , Updated On : September 15, 2023 / 06:09 PM IST
CWC Meeting In Hyderabad

CWC Meeting In Hyderabad

Follow us on

CWC Meeting In Hyderabad: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హైదరాబాద్ ముస్తాబయింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే.. వంటివారు వస్తుండడంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారీగా ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ అగ్ర నాయకులు మొత్తం హైదరాబాద్ తరలి వస్తుండడంతో నగరం మొత్తం భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూడు రంగుల జెండాలతో హైదరాబాద్ నగరం మొత్తం నిండిపోయింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయిన తర్వాత రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిపెద్ద సమావేశం కావడంతో..సీడబ్ల్యూసీ మీటింగ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సమావేశానికి వచ్చే అతిధులకు కనీ విని ఎరుగని స్థాయిలో తెలంగాణ రుచులను రుచి చూపించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని సుప్రసిద్ధ నలభీములను హైదరాబాద్ రప్పించారు. వంటకాలు మొత్తం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నట్టు తెలిసింది. ఎందుకంటే వచ్చేవారంతా కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు కావడంతో.. ఏర్పాట్లలో తేడా రాకూడదని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అన్ని తానయి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

పెద్ద పెద్ద నేతలు మొత్తం వస్తున్న నేపథ్యంలో భారీగా మెనూ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.. ఏకంగా 126 రకాల వంటకాలను అతిధులకు వడ్డించనున్నట్టు సమాచారం. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు పూర్తి తెలంగాణ స్టైల్ లో అతిథులకు విందును ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, వడ, దోశ,ఫ్రూట్ సలాడ్, కిచిడీ, కుర్మా,రాగి సంకటి, మిల్లెట్ వడలను వడ్డించనున్నారు. ఇవే కాకుండా రకరకాలైన పండ్ల రసాలను అందించనున్నారు. మిల్క్ షేక్ లు, రోజ్ మిల్క్ ను కూడా అతిథులకు రుచి చూపించనున్నారు.

మధ్యాహ్నం భోజనంలోకి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యాని, బగార అన్నం, బోటీ కూర, తలకాయ కూర, పాయ, మటన్, మేక కాలేయం వేపుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన యాట కూర, చింతచిగురు యాట కూర, గోంగూర యాట కూర, దోసకాయ యాట కూర, అంకాపూర్ కోడికూర, చేపల కూర, చేపల వేపుడు, హలీం వంటి వాటిని నాన్ వెజ్ మెనూ గా వడ్డించనున్నారు. వెజ్ లో పచ్చి పులుసు, గోంగూర పచ్చడి,గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్ళు…ఇక స్నాక్ ఐటమ్స్ లో సర్వ పిండి, కుడుములు, మురుకులు, మక్క గుడాలు, మొక్కజొన్న గారెలు అతిధులకు రుచి చూపించనున్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన 12 రకాల అతిధులకు వడ్డిస్తారు. సాయంత్రం ఇరానీ చాయ్, బిస్కెట్లను అందించనున్నారు. ఇవే కాకుండా దక్కన్ ప్రాంతానికి చెందిన వంటకాలను కూడా అతిధులకు రుచి చూపిస్తామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.