https://oktelugu.com/

Crop Loan Waiver: నిండా మునిగాక ‘రుణమాఫీ’ చేస్తావా కేసీఆర్ సార్

రుణమాఫీపై క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీ హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటింది. 2018 డిసెంబర్‌ వరకు తీసుకున్న రూ.లక్ష రుణం మాఫీ చేస్తామని కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల సందర్భంగా ప్రకటించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 3, 2023 / 11:55 AM IST

    Crop Loan Waiver

    Follow us on

    Crop Loan Waiver: నాలుగేళ్లుగా.. ఇదిగో రుణమాఫీ.. అదిగో రుణమాఫీ.. వస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఇక వచ్చే ఏడాది అలే అవకాశం లేదు. ఇప్పుడు చేయకపోతే.. నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో రైతుల ఓట్లు కూడా పడవు. ఈ విషయాన్ని గ్రహించిన గులాబీ బాస్‌.. నెల రోజుల్లో రుణమాఫీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు సీఎంవో నుంచి మీడియాకు ఓ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. కొన్ని రోజులుగా కేసీఆర్‌ మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారు. మీడియాకు ముఖం చాటేస్తున్నారు. ఇటీవలి వరదల సందర్భంగా కూడా ప్రగతి భవన్‌ నుంచి సమీక్షలు చేస్తున్నట్లు నోట్‌లు రిలీజ్‌ చేశారు.

    సంబరాలకు కేటీఆర్‌ పిలుపు..
    మొన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. నిన్న రుణమాఫీకి దేశాలు జారీ చేసింది. దీంతో ముఖ్యమైన మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. రాష్ట్రవ్యాప్తంగా సబంరాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ విలీనంపై మూడు రోజులుగా సంబురాలు జరుగుతున్నాయి. రుణమాఫీపై కూడా గ్రామస్థాయి నుంచి సంబరాలు చేయాలని కేటీఆర్‌ సూచించారు.

    క్షేత్రస్థాయిలో వ్యతిరేకత..
    రుణమాఫీపై క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీ హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటింది. 2018 డిసెంబర్‌ వరకు తీసుకున్న రూ.లక్ష రుణం మాఫీ చేస్తామని కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఐదేళ్లు గడిచాయి. ఇప్పటి వరకు కేవలం రూ.38 వేల వరకు రుణం మాఫీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రుణాల మాఫీకి రూ.19 వేల కోట్లు కావాలని తెలిపింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.లక్ష రుణం తీసుకున్న రైతు ఐదేళ్లుగా వడ్డీ కడుతూ వస్తున్నాడు. నెలకు రూ.1.50 వడ్డీ చొప్పున లెక్క కట్టినా.. 60 నెలల్లో లక్షరూపాయల రుణానికి రైతులు ఇప్పటి వరకు రూ.90 వేలు వడ్డీ కట్టారు. ఇన్నేళ్లకు సీఎం రుణమాఫీ అంటూ ప్రకటించడం, సంబరాలు చేయాలని కేటీఆర్‌ పిలుపునివ్వడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

    ఆలస్యానికి కేంద్రమే కారణమట..
    రుణమాఫీ ఇంత కాలం ఎందుకు ఆలస్యం అయిందంటే.. బీజేపీ వల్లేనంటున్నారు కేసీఆర్‌. కేంద్రం తీరువల్లే రుణమాఫీ ఆలస్యం అయిందని ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్షంగా కోతపెట్టింది. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరిగిందన్నారు. హామీ కేసీఆర్‌ ఇచ్చి.. నెపం కేంద్రంపై వేయడమే ఆశ్చర్యంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.6 వేల కోట్లు కేటాయించారు. రుణమాఫీ కావాలంటే.. మరో రూ.13 వేల కోట్లు సమీకరించాల్సి ఉంది.