https://oktelugu.com/

Gujarat : మొసలిని టీవీలో చూస్తేనే భయపడతాం.. అలాంటిది ఏకంగా ఇంటి మీదకే ఎక్కింది.. వీడియో వైరల్

ఈ భూమ్మీద ఉన్న సరిసృపాలలో ప్రమాదకరమైన జంతువుగా మొసలి కి పేరుంది. అలాంటి జంతువును మనం టీవీలో చూస్తేనే భయపడతాం. అది ఏకంగా ఇంటి మీదకే ఎక్కింది. దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 29, 2024 / 04:03 PM IST

    Crocodile spotted at roof of a house

    Follow us on

    Gujarat :  గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వరుణుడు బీభత్సం సృష్టించడంతో ఆ రాష్ట్రం మొత్తం వణికి పోతోంది. ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంతంలో వర్షాలు అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరద నీరు పోటెత్తడం వల్ల సౌరాష్ట్ర ప్రాంతంలోని ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. జలాశయాలలో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయిని మించి ఉన్నాయి. వరద నీరు వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు ద్వీపకల్పాన్ని తలపిస్తున్నాయి. రైలు మార్గాలలో నీరు చేరుకోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పలు రైళ్లను అధికారులు ఎక్కడికక్కడే రద్దు చేశారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 28 మంది మృతి చెందారు. 18,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వచ్చే కొద్ది రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దాదాపు 11 జిల్లాలకు రెడ్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

    ఇంటిపై కప్పుకు ఎక్కింది

    గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. వర్షాల వల్ల వరద నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన మొసలి ఓ ఇంటి పై కప్పుకు ఎక్కింది. అక్కడ అది సేద తీరుతూ కనిపించింది.. గురువారం వడోదర ప్రాంతంలోని అకోటా మైదానంలో విస్తారంగా వర్షం కురిసింది. ఆ వరద నీటిలో సరీ సృపాలు కొట్టుకు వచ్చాయి. అందులో భాగంగానే ఈ ముసలి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.. మరోవైపు గుజరాత్ లో వరద సృష్టించిన విలయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితిపై అంచనా వేశారు. సహాయక చర్యలపై ఆరా తీశారు..కాగా, ఆ మొసలి ఇంటి పైకప్పు పై సేద తీరుతున్న దృశ్యాలను కొంతమంది తమ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం లక్షల కొద్ది వీక్షణలను సొంతం చేసుకుంది.

    మొసలిని రక్షించండి..

    మొసలి ఇంటి పైకప్పునకు ఎక్కిన నేపథ్యంలో.. దాన్ని రక్షించాలని కొంతమంది సోషల్ మీడియాలో అటవీ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొందరేమో అంతటి వరదలో వారు మాత్రం ఎలా వెళ్తారని, మొసలి ని ఎలా రక్షిస్తారని ప్రశ్నిస్తున్నారు. “మొసలి జింక కాదు, సామాన్య ప్రాణి అంతకన్నా కాదు. అది తన ప్రాణాన్ని తాను రక్షించుకోగలదు. దానిని కాపాడేందుకు వెళ్తే అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేస్తుందేమో.. ఒకసారి ఆలోచించండి” అంటూ కొంతమంది నెటిజన్లు పేర్కొన్నారు.. అయితే ఆ మొసలి ఆ వరద ప్రవాహంలోనే దిగువ ప్రాంతానికి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.