Adudam Andhra: వైరల్ వీడియో.. క్రికెట్ బ్యాట్లలోనూ కక్కుర్తేనా

ఏపీలో ప్రస్తుతం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి అక్కడి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు వివిధ రకాలైన క్రీడా పోటీలు నిర్వహిస్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 28, 2023 10:46 am

Adudam Andhra

Follow us on

Adudam Andhra: అవినీతి అనేది ఒక రక్కసి. దానివల్ల సమాజం తీవ్రంగా ప్రభావితమవుతూ ఉంటుంది. అయితే ఈ అవినీతి కొంత కాలం క్రితం వరకు ప్రభుత్వ రంగాల్లో కేటాయింపులు భారీగా ఉండే శాఖలకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఈ రంగం, ఆ రంగం అని లేకుండా అన్ని రంగాలకు అవినీతి అనేది విస్తరించింది. ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఓట్లు కొంటున్న నాయకులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులు భర్తీ చేసుకునేందుకు రకరకాల కుయుక్తులు పందుతున్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల్లో అడ్డగోలుగా కమిషన్లు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా.. ప్రజాధనం కాస్త పక్కదారి పడుతున్నది. ప్రజల సొమ్మును దిగమింగేందుకు అలవాటు పడిన నాయకులు ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.. చివరికి ఆడే ఆట వస్తువుల్లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఆట వస్తువుల్లో ఓ అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రదర్శించిన చేతివాటం చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో ప్రస్తుతం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి అక్కడి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు వివిధ రకాలైన క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. ఆ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తుంది. ఈ పోటీల ముఖ్య ఉద్దేశం క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం. అలా ప్రతిభ చూపిన క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి మెరుగైన ఆటగాళ్ళుగా తయారు చేయడం ప్రభుత్వ ఉద్దేశం. తెరపైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ దీని అమలు సరిగా లేదని తెలుస్తోంది. వాస్తవానికి క్రీడాకారులకు సంబంధించి ఆట వస్తువులు సమకూర్చుతామని ప్రభుత్వమే ముందుగా చెప్పింది. ఇందుకు గానూ వందల కోట్లు ఖర్చు పెట్టింది. కానీ క్రీడాకారులకు సరఫరా చేసిన ఆ క్రీడా వస్తువుల్లో నాణ్యత సరిగా లేకపోవడంతో అవి వెంటనే విరిగిపోతున్నాయి.. దానికి నిదర్శనంగా ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రాంతంలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు హంగూ ఆర్భాటాలతో ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో చూపించిన చొరవ క్రీడా వస్తువుల నాణ్యతలో చూపించలేదు. ఫలితంగా ఆటగాళ్లు ఆడిన కొంతసేపటికి ఆ క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి. పైగా ఆ బ్యాట్ల మీద జగన్ స్టిక్కర్లు వేయడం.. వైసిపి ప్రచారటోపానికి పరాకాష్టగా నిలిచింది.. కాగా ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో వైసిపి నాయకులు చేస్తున్న దోపిడీకి ఈ విరిగిపోయిన నిదర్శమని విమర్శిస్తున్నారు. చివరికి క్రీడా వస్తువుల్లో కూడా చేతివాటం ప్రదర్శించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.