
జాతీయ పార్టీ అంటే.. ఏ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా అక్కడి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించాలి. ప్రభుత్వం సాయం చేసేవరకూ వదలొద్దు. కానీ.. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నట్లు..? దానికి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఏ వైఖరిని అవలంబిస్తున్నట్లు..? ఒక్క ఏపీ సమస్యలే తప్ప ఈయనకు తెలంగాణ సమస్యలు కనిపించవా..? కేసీఆర్‌తో పెట్టుకోవాలంటే భయమా..? లేక ఇక్కడ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కదా అని లైట్ తీసుకుంటున్నారా..?
Also Read: ‘స్థానిక’ ఎన్నికలపై జగన్ యూటర్న్
ఆరేళ్ల క్రితం వరకు కూడా ఇరు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గానే ఉన్నాయి. ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిందో అప్పటి నుంచి తెలంగాణలో పార్టీల పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీలో, తెలంగాణలోనూ పార్టీని నడిపిస్తున్న తెలుగుదేశం అధినేత తమదీ జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నాడు. అటూ.. ఇటూ ప్రత్యేక అధ్యక్షులను నియమించారు సరే. ఇంతవరకు బాగానే ఉన్నా మరి ఇటీవల హైదరాబాద్‌లో వచ్చిన వరదలపై చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ను పల్లెత్తు మాట అనలేదు. వరదలు ఏ రేంజీలో వచ్చాయో.. సిటీ ఎలా మునిగిపోయిందో కూడా ఆయన కళ్లారా చూశారు. కానీ.. అక్కడ కాలనీల్లో తిరిగిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్‌ను విమర్శించిన సందర్భాలూ లేవు. మరి ఎందుకు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు చెప్పుకోవడం అని ఇప్పుడు ప్రజల్లో ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నటనలో అన్న చిరంజీవి నుంచి ఎన్ని రకాల మెలకువలు నేర్చుకున్నారో తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుతో కలిసి అడుగులు వేస్తుంటారు. ఏదైనా విషయంపై బాబు మాటా విధానం చూసిన తరువాత అచ్చం అలాగే తానూ రియాక్ట్ అవుతుంటారు. ఇక తెలంగాణలో ఇటీవల వచ్చిన వరదలు మానవ తప్పిదం. ఇంకా చెప్పాలంటే అక్రమార్కుల, అవినీతిపరుల దందాలకు సామాన్య జనం బలయ్యారు. తెలంగాణలో విపక్ష నేతలుగా బాబు, పవన్ ఎంతైనా మాట్లాడవచ్చు. ఏపీలో ప్రభుత్వం ఏం చేస్తోందంటూ రంకెలు వేస్తారు కానీ.. తెలంగాణ పరిస్థితిపై ప్రశ్నించిన దాఖలాలు లేవు.
Also Read: కన్నా వద్దన్నారు.. సోమువీర్రాజు తీసుకున్నారు..!
సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా ఒంటిచేత్తో డజన్ల కొద్దీ విలన్లను కొట్టే పవన్ రాజకీయ తెర మీద మాత్రం డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారని అనిపిస్తోంది. తెలంగాణలో ఎనిమిది నెలలుగా ఉంటున్న ఆయన అటు కరోనా విషయంలోనూ మిన్నకుండిపోయారు. తెలంగాణలో అన్ని కేసులు వస్తున్నా.. అక్కడి సర్కార్ టెస్టుల సంఖ్య పెంచకున్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. అదే సమయంలో ఏపీ సర్కార్ మీద ప్రతీసారీ దాడి చేస్తూనే కనిపించారు. ఇప్పుడు వరద రాజకీయం మొదలెట్టారు. ఇలా.. స్పందించే చోట స్పందించకుండా అంతా సక్రమంగా ఉన్న దగ్గరే స్పందిస్తుండడంతో ఆయా పార్టీల మీద ప్రజల్లోనూ అపనమ్మకం ఏర్పడుతోంది.
Comments are closed.