YCP MP’s and MLA’s : 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు ప‌ద‌వీగండం.. ఏడీఆర్ రిపోర్టు ఏం చెబుతోంది?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక‌రిద్ద‌రు కాదు.. ఏకంగా 22 మంది ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ద‌వీ గండం ఎదుర్కొంటున్నారు. 18 మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు ఎంపీల ప‌ద‌విపై క‌త్తి వేళాడుతోంది. దీంతో.. ఏం జ‌ర‌గ‌బోతోంది అనే టెన్ష‌న్ వారిలో నెల‌కొంది. ఏడీఆర్ రిపోర్టులో ఈ 22 మంది పేర్లు ఉన్నాయి. ఏం జ‌రుగుతోంది? వాళ్ల పదవికి వచ్చిన ముప్పు ఏంటీ? అన్న‌ది చూద్దాం. దేశంలోని ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఉన్న క్రిమిన‌ల్ కేసుల‌ను వేగంగా ప‌రిష్క‌రించాల‌ని ఆ మధ్య సుప్రీం కోర్టు ఆదేశించిన […]

Written By: Bhaskar, Updated On : August 24, 2021 6:03 pm
Follow us on

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక‌రిద్ద‌రు కాదు.. ఏకంగా 22 మంది ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ద‌వీ గండం ఎదుర్కొంటున్నారు. 18 మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు ఎంపీల ప‌ద‌విపై క‌త్తి వేళాడుతోంది. దీంతో.. ఏం జ‌ర‌గ‌బోతోంది అనే టెన్ష‌న్ వారిలో నెల‌కొంది. ఏడీఆర్ రిపోర్టులో ఈ 22 మంది పేర్లు ఉన్నాయి. ఏం జ‌రుగుతోంది? వాళ్ల పదవికి వచ్చిన ముప్పు ఏంటీ? అన్న‌ది చూద్దాం.

దేశంలోని ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఉన్న క్రిమిన‌ల్ కేసుల‌ను వేగంగా ప‌రిష్క‌రించాల‌ని ఆ మధ్య సుప్రీం కోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వారిపై ఉన్న కేసుల విచార‌ణ వేగంగా కొన‌సాగుతోంది. ఈ మేర‌కు ప్ర‌జాస్వామిక సంస్క‌ర‌ణ‌ల సంఘం (ఏడీఆర్) ఓ నివేదిక విడుద‌ల చేసింది. దేశంలో మొత్తం 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్టు వెల్ల‌డించింది. వీరిలో ఎంపీలు 67 మంది కాగా.. ఎమ్మెల్యేలు 296 మంది ఉన్నారు.

ఇందులోనూ కేంద్రంలోని అధికార పార్టీదే అగ్ర‌తాంబూలంగా ఉంది. మొత్తం 363 మందిలో.. బీజేపీకి చెందిన 83 మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. ఆ త‌ర్వాత స్థానం కాంగ్రెస్ పార్టీది. ఈ పార్టీ నుంచి గెలిచిన వారిలో 47 మందిపై కేసులున్నాయి. తృణ‌మూల్ కాంగ్రెస్ కు చెందిన 25 మంది కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇటు వైసీపీ నుంచి కూడా 22 మంది ప్ర‌జాప్ర‌తినిధులు క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

వైసీపీకి చెందిన వారిలో ఎంపీలు మిథున్ రెడ్డి, మార్గాని భ‌ర‌త్‌, బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. ఇక‌, ఎమ్మెల్యేల్లో మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి, పి. ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి స‌హా మొత్తం 18 మందిపై కేసులు ఉన్నాయి. టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం, వాసుప‌ల్లి గ‌ణేష్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అటు తెలంగాణ‌లో బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ మాలోతు క‌విత ఉన్నారు.

వీరంద‌రిపై విచార‌ణ కొన‌సాగుతోంది. ప్ర‌జాప్రాతినిథ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 8 (1, 2, 3)లో పేర్కొన్న నేరాల కింద‌కు వ‌చ్చే కేసుల వివ‌రాల‌ను ఏడీఆర్ రిపోర్టు వెల్ల‌డించింది. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం ప్ర‌జాప్ర‌తినిధుల‌పై నేరం రుజువై, శిక్ష ప‌డితే.. వారిపై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది. అంటే.. వారి ప‌ద‌వి ఊడిపోతుంది. ఇప్పుడు ఇదే భ‌యం అంద‌రికీ ప‌ట్టుకుంది. కేసుల విచార‌ణ వేగ‌వంతం కావ‌డంతో.. ఏం జ‌రుగుతుందోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. మ‌రి, కోర్టు వీరిని దోషులుగా తేలుస్తుందా? నిర్దోషులుగా గుర్తిస్తుందా? అన్న‌ది చూడాలి.