CPI Supports To TRS: వామపక్ష పార్టీల భావజాలం ఒక పట్టాన కొరుకుడు పడదు. ఎప్పుడు ఏ పార్టీతో వారు కలుస్తారో, ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారో వారికే తెలియదు. అందుకే ఆ పార్టీలను సూది, దబ్బుణాలని కెసిఆర్ ఎప్పుడో తేల్చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలైనా సొంతంగా ఎదగాలని ఆ పార్టీలకు ఎప్పుడూ లేదు. ఏదో ఒక పార్టీకి తోకలుగా ఉండాలనే తపన తప్ప. అసలు వామపక్ష పార్టీల రాజకీయ ప్రయాణమే పూర్తి అబ్సర్డ్. కొన్నాళ్లు టిడిపి తో ప్రయాణం సాగించాయి. మరికొన్నాళ్లు కాంగ్రెస్ తో జతకట్టాయి. ఇప్పుడు టిఆర్ఎస్ తో సంధి కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ కు తత్వం బోధపడటంతో వామపక్షాలను దూరం పెట్టాడు. ఇక జగన్ అయితే వామపక్ష పార్టీలను అస్సలు పట్టించుకోడు.
ఒకప్పుడు ప్రగతిభవన్ ఛాయాల్లోకి కూడా రానివ్వని కేసీఆర్.. ఇప్పుడు మునుగోడులో అవసరం కనుక ఒక పిలుపు పిలిచాడు. వెంటనే చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు వాలిపోయారు. ఏవేవో చర్చలు జరిపారు. అంతిమంగా బానిసలుగా పని చేస్తామని తలలు ఊపి వచ్చారు. కేసీఆర్ ఎవరినీ మాట్లాడనీయడు. వీరికి మాట్లాడే అవకాశం ఇవ్వడు. రెండు చాయలు పోసి, ఇన్ని బిస్కెట్లు పెట్టి, మధ్యాహ్నం అన్నం పెట్టి పంపించాడు. ఆ మర్యాదకే కమ్యూనిస్టులు పొంగిపోయారు. మేము మునుగోడులో పోటీ చేయడం లేదు బిజెపిని ఓడించేందుకు టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.
వాస్తవానికి కెసిఆర్ కు లెఫ్ట్ పార్టీలు అంటే లెఫ్టే! దీనికి అర్థం ‘విడిచి పెట్టేశాడని..’ అప్పుడంటే ఉద్యమ సమయంలో అవసరం కాబట్టి దగ్గరకు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక చాలా దూరం పెట్టేశాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాళ్లు ఎదురవుతున్నాయి కాబట్టి, అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణలో మరో 16 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఈ సమయంలో మునుగోడులో గెలిస్తేనే పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చినట్టవుతుంది కాబట్టి.. అర్జెంటుగా తన అమ్ముల పొడిలో ఉన్న మజ్లీస్ అనే లౌకికవాది పార్టీ తో పాటు అదనపు సెక్యులర్ జెండాలు కావాలి కాబట్టి కమ్యూనిస్టులకు మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు.
-తోకలమని సగర్వంగా ప్రకటించుకున్నారు
ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది. రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. కనీసం ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేని స్థాయికి వాటి చరిష్మా పడిపోయింది. గత్యంతరం లేక ఇతర పార్టీలకు తోకలుగా మిగిలి పోవాల్సి వచ్చింది. ” ఆ మతతత్వ, ఫాసిస్టు బిజెపిని ఓడించేందుకు ఏ లౌకికవాద పార్టీతో అయినా కలిసి పని చేసేందుకు మేము సిద్ధం అని” కమ్యూనిస్టులు ప్రకటించారు. ఇంకేముంది ఈ సాకుతో కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. నిమిషాల్లో ప్రగతిభవన్లో వాలిపోయారు. గులాబీ పార్టీకి మేము తోకలమని సగర్వంగా ప్రకటించారు. ముందు సిపిఐ ప్రకటన పూర్తయింది. కాస్త బెట్టు చేసి, బేరమాడే స్థాయి ఉన్న సిపిఎం ఆ తర్వాత ప్రకటించింది. ఇందుకు తమ్మినేని కృష్ణయ్య హత్య కారణమని పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బూర్జువా పార్టీలతో పొత్తులు, అవగాహనలు ఏ సిద్ధాంతాల కిందికి వస్తాయో కమ్యూనిస్టు పార్టీల నాయకులకే తెలియాలి. ఈ ఎపిసోడ్లో కాస్త సిపిఎం ను వదిలేస్తే సిపిఐ నాయకులు అంటున్న మాటలే వెగటు పుట్టేలా చేస్తున్నాయి. “మునుగోడులో మేము పోటీ చేసేందుకు సిద్ధంగా లేము. మా బలం కూడా అందుకు సరిపోదు. అందుకే మేము టిఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నామని” ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పటం జాలి కలిగిస్తోంది. వాస్తవానికి మునుగోడులో ఐదు సార్లు సిపిఐ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ అభ్యర్థులు ఏ పార్టీలకు తోకలుగా ఉండి గెలిచారో?, గెలిచాక ఏ స్థాయిలో బలపడ్డారో?, బలపడే అవకాశం లేనప్పుడు ఇతర పార్టీల ప్రాపకం కోసం ఎందుకు పాకులాడుతున్నారో? కేడర్ సంధిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ పోరాటాలు ఎందుకు? ఈ ఆరాటాలు ఎందుకు? ఇప్పటికీ గ్రామాల్లో ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంది. అయినప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి గుంప గుత్తగా బట్వాడా చేసే సంస్కృతి ఆ నాయకుల్లో ఉంది. ఆ విధానమే ఆ పార్టీల ఎదుగుదలకు ప్రధాన అవరోధం. ఈ ఫ్యూడల్ పార్టీలకు, ఫాసిస్ట్ పార్టీలకు, అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా ఒక్కటవుదాం. ప్రజలను సమీకరించి పోరాటాలు చేద్దాం. అనే ఉద్యమకాంక్ష ఏమైంది? ఎన్నికలకు సిద్ధంగా లేము కాబట్టి మునుగోడులో టిఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నామని ఆ పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటన దివాలాకోరు తనాన్ని ప్రదర్శిస్తోంది.
ఒక్క మునుగోడే కాదు ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తామని కమ్యూనిస్టు నాయకులు చెబుతుండటం పడిపోతున్న వారి స్థాయిని సూచిస్తోంది. కానీ ఏ మాటకు ఆ మాట “టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నాం. కానీ ప్రజా సమస్యలపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది” అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. అధికార పార్టీకి తోకలుగా మారిన తర్వాత ప్రజా సమస్యలపై పోరాటాలు ఎలా చేస్తారో కమ్యూనిస్టు నాయకులే చెప్పాలి. అలా ఉద్యమాలు చేస్తే అధికార పార్టీ, అందునా సీఎం కేసీఆర్ ఊరుకుంటాడా? పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, అంగన్వాడీ కార్యకర్తల సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసినప్పుడు సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో కమ్యూనిస్టు నాయకులకు గుర్తు ఉందా? “చందాలకు దందాలకు పాల్పడతారు. వారి మాటలు ఎవరూ నమ్మొద్దు” అని హితవు పలికింది నిజం కాదా? ప్రతిసారి ప్రగతిశీల ప్రజాస్వామ్యం అంటూ వల్లె వేసే కమ్యూనిస్టు నాయకులు..తాము బాగుంటేనే ప్రగతి శీలం అని భావిస్తుంటారు. ఇలాంటి ప్రగతిశీల శక్తితోనే బిజెపిని ఎదుర్కొంటామని కామ్రేడ్స్ అంటారు. హేమిటో! ఈమధ్య అందరు కమ్యూనిస్టు నాయకులు అచ్చం ఆ చికెన్ నారాయణ లాగానే మాట్లాడుతున్నారు.
Also Read:Chandrababu- Pawan Kalyan: పవన్ కు మద్దతుగా చంద్రబాబు.. పొత్తు పొడిచినట్టేనా?