ఇప్పటి వరకు కరోనా వైరస్ కు మందు లేదన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ తోనే రక్షణ అని ప్రపంచం నిర్ణయానికి వచ్చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు.. అన్ని దేశాలూ వ్యాక్సినేషన్లో బిజీగా ఉన్నాయి. అయితే.. వాటి సమర్థ ఎంత అన్న విషయంలో స్పష్టమైన క్లారిటీ లేదనే చెప్పాలి. కరోనాను ఎంత మేర వ్యాక్సిన్ ఎదుర్కొంటుంది? అన్నప్పుడు క్లియర్ కట్ గా ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. అయితే.. తాజా అధ్యయనం మాత్రం కీలకమైన సమాధానం చెబుతోంది. కరోనా వైరస్ పై వ్యాక్సిన్ ప్రభావం ఏంటన్నది వెల్లడిస్తోంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మరణాల శాతం గణనీయంగా తగ్గిపోయినట్టుగా వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవలం 0.4శాతం మంది మాత్రమే మరణించినట్టు లెక్కగట్టిందీ అధ్యయనం. 677 కొవిడ్ రోగుల జీనోమ్ సీక్వెనింగ్ డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనంలో వ్యాక్సిన్ సామర్థ్యం అద్భుతంగా ఉందని తేలింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా వస్తుందన్న సంగతి తెలిసిందే.. అయితే.. మరణం రాకుండా వ్యాక్సిన్ అడ్డుకుంటోందని తేలింది.
ప్రస్తుతం ప్రపంచంపై డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు బలంగా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 112 దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రభావం చూపుతోందని సమాచారం. గతేడాది అక్టోబర్ లో భారత్ లో గురించిన ఈ వేరియంట్.. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ కనిపించింది. యూరప్ దేశాల్లో గట్టిగానే ప్రభావం చూపుతోంది. అయితే.. ఈ వేరియంట్ ను వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా.. సాధారణ జ్వరం మాదిరిగా ఇబ్బందులు ఎదురవడం మినహా.. ప్రాణాపాయం ఉండట్లేదని నిపుణులు చెబుతున్నారు.
అందుకే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాక్సినేషన్ పై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో మినహా.. ఎక్కడా సరైన రీతిలో వ్యాక్సిన్ సరఫరా జరగట్లేదు. భారత్ లో ఇప్పటి వరకు కేవలం 20 శాతం మందికి కూడా వ్యాక్సిన్ అందలేదని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి, వేగంగా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారానే కరోనాను తరిమికొట్టడం సాధ్యమవుతుందని అంటున్నారు.