కేంద్రం 46.46 మిలియన్ డోసులు ఏపీకి ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58.74 మిలియన్ డోసులు ప్రజలకు ఇచ్చిందని ఆరోగ్య ఆంధ్ర ట్విటర్ అధికారిక హ్యాండిల్ లో ముద్రించారు. 46 మిలియన్ల డోసులు వస్తే 58 మిలియన్లు అని చెప్పుకుంది. మిగతా 12 మిలియన్లు అంటే కోటి ఇరవై లక్షల డోసులు ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది.
విషయం తెలుసుకున్న ఆరోగ్యాంధ్ర నిర్వాహకులు దాన్ని డిలిట్ చేశారు. పదినిమిషాల వ్యవధిలో మళ్లీ పోస్టు చేశారు. కానీ 46 మిలియన్లకు బదులు 4.6 మిలియన్లు అని పెట్టారు. కానీ 4.6 మిలియన్లు ఇస్తే 5.8 మిలియన్ల టీకాలు ఎలా వేశారని మరో సారి అనుమానాలు కలిగాయి. దీంతో ఆరోగ్యాంధ్ర నిర్వాహకులు ట్వీట్ ను తొలగించి కొత్తగా ట్వీట్ చేశారు.
కేంద్రం నుంచి 4.11 మిలియన్ల టీకాలు వస్తే 3.98 మిలియన్ల డోసులు పంపిణీ చేశామని చెప్పారు. తప్పుడు లెక్కలతో ఆరోగ్యాంధ్ర నిర్వాహకులు పడిన టైం పాస్ ను నెటిజన్లు ఆడుకున్నారు. అవకాశం దొరికితే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? టీడీపీ సైతం తప్పుడు లెక్కలపై ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. గాలి లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించింది. వ్యాక్సిన్ విషయంలో సర్కారు పరువును ఆరోగ్యాంధ్ర రోడ్డున పడేసింది.