కేంద్రం చివాట్లతో ఏపీలో కర్ఫ్యూ వాతావరణం

ఏపీలో అసలు కరోనా వైరస్ ప్రభావమే లేదంటూ మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై విరుచుకు పడిన రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా ప్రమాదం గుర్తించినా, కార్యాచరణలో మాత్రం తడబడుతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ అమలు పరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ప్రకటించినా సోమావారం ఎక్కడ ప్రభావం కనిపించక పోవడంతో కేంద్రం నుండి చివాట్లు ఎదురైన్నట్లు తెలుస్తున్నది. దేశంలో మరెక్కడా […]

Written By: Neelambaram, Updated On : March 24, 2020 11:41 am
Follow us on

ఏపీలో అసలు కరోనా వైరస్ ప్రభావమే లేదంటూ మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై విరుచుకు పడిన రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా ప్రమాదం గుర్తించినా, కార్యాచరణలో మాత్రం తడబడుతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ అమలు పరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ప్రకటించినా సోమావారం ఎక్కడ ప్రభావం కనిపించక పోవడంతో కేంద్రం నుండి చివాట్లు ఎదురైన్నట్లు తెలుస్తున్నది.

దేశంలో మరెక్కడా కూడా ఇంత ఉదాసీనంగా ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించినట్లు లేదు. కొన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ను సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ వెంటనే కేంద్ర హోమ్ కార్యదర్శి, కాబినెట్ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కఠిన చర్యలు తీసుకోమని వ్యక్తిగతంగా చెప్పడంతో ప్రభుత్వం అప్పటికి కూడా మేల్కొనలేదు. దానితో మంగళవారం నుండి కఠినంగా అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సమాయత్తం అవుతున్నది.

ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం స్పష్టం చేయడంతో పాటు కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ప్రధాని మోడీ స్పష్టం చేయడం గమనార్హం. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ సోమవారం ఉదయం ప్రజలు చాలా చోట్ల రోడ్లపైకి వచ్చేశారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు పెద్దఎత్తున చేరుకున్నారు. గుంపులు గుంపులుగా రోడ్లపైకి జనం చేరడం, అదే సమయంలో కేంద్రం కూడా తీవ్రంగా హెచ్చరించడంతో తరువాత పోలీసులు అప్రమత్తమై రోడ్లపై తిరుగుతున్న వాహనాలను నియంత్రించారు.

లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. మంగళవారం నుండి అప్రకటిత కర్ఫ్యూ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం ఆరుగంటల నుండి తొమ్మిది గంటల వరకూ మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు కిరాణా షాపులు, రైతుబజార్లకు అవకాశం కల్పించారు. రాత్రి ఏడుగంటల నుండి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటకు రావడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారు.

ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఎటిఎం వాహనాలకు అనుమతిచ్చారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడుగంటల వరకూ హోటళ్లలో టేక్‌అవేకి అనుమతి ఇస్తున్నారు. ఇరుకుగా ఉన్న రైతు బజార్లను విశాల ప్రాంతాలకు మార్చడం ప్రారంభించారు. నిత్యాసరాల ధరలు నిర్ణ యించి పరిశీలించే అధికారం కలెక్టర్లకు అప్పగించారు.

బ్యాంకులు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే పనిచేసే విధంగా చేశారు. కొత్త ఎకౌంట్లు, రుణాల మంజూరు వంటి కార్యకలాపాలన్నీ నిలిపేశారు. సగం మంది సిబ్బందితో నిర్వహించాలని బ్యాంకర్ల అసోసియేషన్‌ నిర్ణయంచింది. అన్ని ఎటిఎంలలో సరిపోయినంత డబ్బు ఉంచి, ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రకటించింది. మంగళవారం నుండి మీ సేవ కేంద్రాలు నిలిపివేస్తారు.

రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పోలీసు స్టేషన్ల వారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని, పదే పదే తిరిగే వాహనాలను గుర్తించి సీజ్‌ చేస్తామని డిజిపి గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అత్యవసర వస్తు రవాణా వాహనాలకు మాత్రమే అనుమతిస్తారని, సీజ్‌ చేసిన వాహనాలను వైరస్‌ ప్రభావం తగ్గిన తరువాత మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు.