Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల నగారాకు సమయం ఆసన్నమైంది. వచ్చే ఏడాది జనవరి 16తో ప్రస్తుత ప్రభుత్వం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సీఈసీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ప్రకక్రియ ప్రారంభించిన ఎన్నికల కమిషన్.. దానిని ఇప్పుడు వేగవంతం చేసింది. ఈ క్రమంలో అక్టోబర్ 3 నుంచి 5 వరకు రాష్ట్ర పర్యటనకు రానుంది. మూడు రోజుల పర్యటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులను విశ్లేషించి అక్టోబర్ మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సమాయత్తం అవుతోంది.
తాత్కాలిక షెడ్యూల్ రెడీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతుండడంతో బీఆర్‌ఎఎస్ ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నాయి. ప్రధాని మోదీ తెలంగాణలో అక్టోబర్ 1న ఎన్నికల ప్రచార శంఖారావానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కూడా సెడ్యూల్‌పై దృష్టి పెట్టింది. ఎన్నికల ఏర్పాట్లు పైన కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్‌ను సిద్దం చేసుకుంది. ఈ మేరకు కార్యక్రమాలకు గడువు నిర్దేశించుకున్నారు. కొన్నిరోజులు అటూఇటుగా ఇదే షెడ్యూల్‌తో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
నాటి షెడ్యూల్ ప్రకారమేనా..
ఎన్నికల కసరత్తులో భాగంగా అధికారులు ఒక షెడ్యూల్ సిద్ధ చేసుకున్నారు. 2018 ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా రాబోయే ఎన్నికల షెడ్యూల్ రూపొందిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణతోసహా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నిర్వహణకు అక్టోబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్ అక్టోబర్ 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటిస్తుంది. పర్యటన తరువాత వాస్తవ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. నిర్దిష్ట తేదీలతో అక్టోబర్ టు డిసెంబర్ వరకు రోజువారీగా చేయాల్సిన కార్యాక్రమాలతో ఎన్నికల సంఘం ఓ క్యాలెండర్ రూపొందించింది.
సర్వం సిద్ధం..
ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు ప్రథమస్థాయి తనిఖీలు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రి సమీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ ఎంపిక, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన.. నిర్ధారణ, దర్యాప్తు సంస్థల నోడల్ అధికారులు.. సహాయ వ్యయ పరిశీలకులు.. వ్యయ పర్యవేక్షణ బృందాలు..రిటర్నింగ్ అధికారులు..సెక్టార్ అధికారులకు వేర్వేరుగా శిక్షణ, జిల్లాలకు నిధుల కేటాయింపు పైన నిర్ణయం తీసుకోనున్నారు అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన ధరల పరిశీలన టీమ్‌ల ఏర్పాటు తదితర పనులన్నీ వచ్చే అక్టోబర్‌లో పూర్తి చేయాలని సీఈవో నిరేద్శించుకుంది.
కౌంట్‌డౌన్ షురూ..
నవంబర్‌లో వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వనుంది. పోలింగ్ కేంద్రాల ప్రకటనతో పాటుగా దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే ఫారం 12డీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తారు. సీ–విజిల్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల స్వీకరణ.. ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్.. కౌంటింగ్ ఏజెంట్ల నియామకం.. బ్యాలెట్ పత్రాల ముద్రణ.. పోస్టల్ బ్యాలెట్ల పంపిణ్టీ.. స్వీకరణ తదితరాలన్నీ పూర్తి చేయాలని షెడ్యూల్‌గా నిర్ణయించుకున్నారు.
కేంద్రంలో జమిలి ఎన్నికల పైన కొంత కాలంగా ప్రచారం సాగినా.. ఆ ప్రతిపాదన ఇప్పట్లో అమలు కాదని తేలటంతో ఎన్నికల షెడ్యూల్ మరో 10–15 రోజుల్లో విడుదల చేసేందుకు ఈసీ సమాయత్తం అవుతోంది.