Homeజాతీయ వార్తలుకేసీఆర్ అన్నట్టే.. కొండంత అవినీతి?

కేసీఆర్ అన్నట్టే.. కొండంత అవినీతి?

revenue departmentప్రభుత్వం అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది రెవెన్యూ, పోలీసు శాఖలు. రెవెన్యూ అంటేనే ఆదాయం.. ఆ ఆదాయం ప్రభుత్వానికి చేర్చేలాగా ఆ శాఖ పనిచేయాలి. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో అంతా రివర్స్‌. ప్రభుత్వానికి ఆదాయం ఇస్తే తమకేమస్తుందని అనుకుంటున్నారో ఏమో ముందు తమ బ్యాంకు ఖాతాలను నింపుకోవాలని చూస్తున్నారు. అందుకే ఎక్కడ చూసినా ఆ శాఖ వారు లంచాలకు మరిగారు. నిత్యం ఎక్కడో ఓ చోట.. ఏదో ఒక స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నాడు. అయినా.. శాఖ తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

ఓ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లో ఒక్క కీసర ఎమ్మార్వో రూ.రెండు కోట్ల లంచం డిమాండ్‌ చేశాడు. ఆగస్టు 14న రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా ఆయన లాకర్‌‌ తెరిస్తే అందులో రూ.57 లక్షల నగదే బయటపడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే రాష్ట్రంలోని ఒక్క మండలానికి చెందిన ఎమ్మార్వోనే ఇంతలా సంపాదిస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అవినీతి జరుగుతున్నట్లు..? ఈ లెక్కల్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ఎంత అవినీతిమయం అయిందో. పేదలను ఏ స్థాయిలో పీడించుకుతింటున్నారో తెలిసిపోతోంది.

రాష్ట్రవ్యాప్తంగా సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోంది. అందులో భాగంగా ఇటీవల పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వడం.. సాదాబైనామాలకు పట్టాలు..  భూమి రికార్డుల సంస్కరణ.. ధ్రువీకరణ పత్రాలు.. తదితర బాధ్యతలు రెవెన్యూ శాఖకు అప్పజెప్పారు. వీటి జారీ చేసే టైంలోనూ అవినీతి రాజ్యమేలింది. కొందరు అధికారులు మధ్య దళారి వ్యవస్థను ఏర్పరచుకొని లంచగొండులుగా మారడం, లిటిగేషన్లతో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేయడం లాంటి పనుల మూలంగా రెవెన్యూ వ్యవస్థ పనితీరు మసకబారింది. ముఖ్యంగా సాదాబైనామాల విషయంలో సైతం ఈ శాఖలో కొందరు ఉద్యోగులు, అధికారులు రేట్లు పెట్టి రైతుల నుండి పైసలు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

రాష్ట్రంలో అసలు భూమి శిస్తులే రద్దు చేసిన తర్వాత ఈశాఖ అవసరం ఎంతవరకు ఉంది..? పన్నుల వసూలుకు వాణిజ్య పన్నుల శాఖ, భూముల రిజిస్ట్రేషన్లకు రిజిస్ట్రేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖ, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఇన్ని రకాల పన్ను వసూలు వ్యవస్థలు జనం సొమ్ముతో ఏర్పరిచి ప్రజలకు చుక్కలు చూపించడం ఎంతవరకు సబబు..? సీఎం కేసీఆర్‌‌ సైతం రెవెన్యూ వ్యవస్థలో మౌలిక మార్పులకు శ్రీకారం చుడుతామని గతంలోనే బహిరంగ ప్రకటన చేశారు. దీంతో రెవెన్యూ సంఘాలు విస్మయానికి గురయ్యాయి. ఒకానొక సందర్భంలో రెవెన్యూ శాఖనే కేసీఆర్ రద్దు చేయబోతున్నారనే ప్రకటనలు వచ్చాయి. ఫ్యూడల్, వలసవాద అవశేషంగా ఉన్న ఈ శాఖను రద్దుచేసి ప్రత్యామ్నాయం చూపగలిగితే, పరిపాలనా సంస్కరణల్లో కేసీఆర్ తనదైన చరిత్రను లిఖించుకున్నట్లే..?  కానీ అలా చేస్తారా.. అంత సాహసం చేస్తారా.. అనేది అందరికీ తెలిసిందే.

కీసర ఎమ్మార్వో నాగరాజు రూ.1.1 కోట్ల లంచం తీసుకున్న కేసులో ఏసీబీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎమ్మార్వో నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్ తెరిచేందుకే అధికారులు ఇన్ని రోజులూ ఇబ్బందులు పడ్డారు. ఏసీబీ అధికారుల విచారణలో ఎమ్మార్వో నాగరాజు బ్యాంకు లాకర్ గురించి ఎటువంటి వివరాలూ వెల్లడించలేదు. లాకర్ తెరిచేందుకు ఎమ్మార్వో భార్య కూడా అధికారులను తప్పుదోవ పట్టించిందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు ఎమ్మార్వో నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు.

అల్వాల్‌లోని ఓ బ్యాంకులో ఉన్న ఈ లాకర్‌‌ను తెరవగా అధికారులు అందులో రూ.57 లక్షల పైబడి విలువైన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలు అందులో ఉన్నాయి. వీటన్నింటినీ ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. నాగరాజు బినామీ పేరుతో లాకర్ తెరిచారు. బామ్మర్ది నరేందర్ పేరుతో సౌత్ ఇండియన్ బ్యాంకులో సీక్రెట్ లాకర్ తెరిచి ఉంది. అయితే ఈ కేసులో ఏసీబీ అధికారులు నాగరాజు భార్య కోసం గాలిస్తున్నారు. ఆమె ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కూడా పట్టుబడితే ఇంకెన్ని ఆస్తులు, నగదు వివరాలు బయటపడతాయో అంచనా వేయలేం.

మరోవైపు నిత్యం ఏసీబీకి పట్టుబడుతున్నా.. వారిపై కేసులు నమోదవుతున్నా.. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ వారు మాత్రం భయపడడం లేదు. దొరికిన వారిలో నుంచి 65 శాతం మంది కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆయా శాఖలు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనిని ఆఫీసర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంతేగాకుండా పైరవీలు చేయించుకుంటూ కేసులను క్లోజ్‌ చేయించుకున్న దాఖలాలూ ఉన్నాయి. ఏటా రాష్ట్రంలో పట్టుబడుతున్న ఆయా శాఖల ఆఫీసర్లలో సింహభాగం రెవెన్యూ శాఖ వారిదే. గత 2018లో 37 మంది పట్టుబడితే.. 2019లో 54 మంది మీద ఏసీబీ కేసులు నమోదయ్యాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular