
దేశీయ విమానయాన రంగాన్ని కరోనా వైరస్ మహమ్మారి కకావికలం చేస్తున్నది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ పరిశ్రమను లాక్‌డౌన్ పరిస్థితులు కోలుకోలేని విధంగా చేస్తున్నాయి. దానితో విమానయాన, దాని అనుబంధ-ఆధారిత రంగాల్లో 20 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం (ఐఏటీఏ) హెచ్చరించింది.
విమానాలు మూత బడడంతో ఆదాయంలేక ఉద్యోగులకు జీతాలు చెల్లించడం దుర్లభంగా మారుతున్నది. ఫలితంగా వేతనాల్లో కోత, ఉద్యోగులనే తొలగించడం అనివార్యంగా స్పష్టమవుతున్నది. ఇప్పటికే చాలా సంస్థలు జీతాల్లేని సెలవులను ఉద్యోగులకు బలవంతంగా ఇచ్చేస్తున్నాయి. ప్రస్తుతం కార్గో విమానాలు మినహా ప్యాసింజర్ విమానాలు ఎగరడం లేదు.
ఏప్రిల్ 15 నుండి పాక్షికంగానైనా వెసులుబాటు లభిస్తుందని ఎదురు ఈ రంగానికి నిరాశే ఎదురైనది. పైగా మే 3 వరకు విమానాలకు అనుమతి ఉండబోదని ప్రకటించడం తెలిసిందే. భారతీయ విమానయాన పరిశ్రమకు ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదాయం దాదాపు రూ.70,000 కోట్లు దూరమైందని ఐఏటీఏ ఈ సందర్భంగా అంచనా వేసింది.
ప్యాసింజర్ డిమాండ్ 36 శాతం పడిపోయిందన్న ఐఏటీఏ.. ఈ క్రమంలోనే 20 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయన్నది. ఈ కష్టకాలంలో కొత్త రుణాలమంజూరు, రుణాల పూచీకత్తు, కార్పొరేట్ బాండ్ మార్కెట్‌లో మద్దతు వంటి చర్యల ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలతోపాటు ఏరోనాటికల్ చార్జీలను పూర్తిగా లేదంటే పాక్షికంగా రద్దు చేయాలని కోరుతున్నారు.
కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో అంతర్జాతీయ విమానయాన కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. దీనివల్ల విమాన పరిశ్రమకు నిమిషానికి సుమారు రూ.3.77 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని ఐఏటీఏ ప్రకటించింది.