
రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కరోనా నేపథ్యంలో పస్తులు ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు లేకున్నా అడిగిన అర్హులైన వారందరికీ రేషన్ మంజూరు చేయాలని అధికారులను అదేశించింది. రేషన్ కార్డు లేనివారికి ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంభందించింన వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. లభిదారులకు సరుకుల పంపిణీలో ఇబ్బందులు అదిగమించేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్ తో పాటు రూ.వెయ్యి నగదు సాయం అందని వారికి త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభించామని, రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా కార్డుదారులకు కూపన్లు అందిస్తున్నామన్నారు. కూపన్ల మీద ఉన్న సమయానికి వచ్చి రేషన్ తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఏపీ ప్రభుత్వం దారిద్య్రపు రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు అందజేస్తోంది. ఇందుకు నెలల తరబడి సమయం పడుతోంది. దీనికి భిన్నంగా ప్రస్తుతం ఐదు రోజుల్లోనే కార్డు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డు పొందేందాలనుకునే వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం నింపాలి. ఇవి అన్ని మీసేవ కేంద్రాల్లో దొరుకుతాయి. లేకపోతే మీసేవ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తును పూర్తి చేసిన అనంతరం ఆధార్, ఓటర్ కార్డు, ఇంటి అడ్రస్ తెలిపే తదితర డాక్యుమెంట్ల నకలు జత చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును గ్రామ సచివాలయంలో అందచేయాలి. సచివాలయ ఉద్యోగులు దరఖాస్తు దారుని అర్హతలు పరిశీలించి, అర్హులైన వారికి కార్డు మంజూరు చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు వివరాలు అందిస్తారు.
అంతేకాకుండా.. ‘స్పందన’ యాప్ లేదా 1800 452 4440, 1100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.