
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో ఉన్న హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో పని చేస్తున్న కొందరు ‘కరోనా’ బారిన పడ్డారంటూ జరుగుతున్న ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి పాలప్యాకెట్లు తీసుకు వెళతారు కనుక ఇలాంటి చోట ‘కరోనా’ బాధితులు ఉంటే విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని అన్నారు. కనుక, తక్షణమే ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని అన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి చాలా సలహాలు ఇచ్చే చంద్రబాబు, తమ సంస్థలో వైరస్ బాధితులు ఉన్నారన్న ప్రచారంపై వివరణ ఇవ్వకపోతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తికమకపడే అవకాశం ఉంది కనుక దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉప్పల్ లోని హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో సుమారు 40 మందికి కరోనా సోకిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సంస్థ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులలో ఆందోళన నెలకొంది. సంస్థ నిర్వాహకులు ఈ సంఘటనపై స్పందించ లేదు.