కరోనాతో రెక్కలు విరిగిన విమానయానం

కరోనా వైరస్‌ ప్రభావంతో అన్నింటికన్నా ముందుగా కీలకమైన విమానయాన రంగాన్ని దారుణంగా కుంగిపోతున్నది. ఈ మహమ్మారి ప్రభావంతో అతధికంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడం, దేశీయంగా కూడా గణనీయంగా ప్రయాణించే వారి సంఖ్య పడిపోతూ ఉండడంతో కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి. పలు దేశీయ విమానయాన సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి. మార్కెట్‌ వాటాపరంగా దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తమ ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత […]

Written By: Neelambaram, Updated On : March 20, 2020 11:51 am
Follow us on

కరోనా వైరస్‌ ప్రభావంతో అన్నింటికన్నా ముందుగా కీలకమైన విమానయాన రంగాన్ని దారుణంగా కుంగిపోతున్నది. ఈ మహమ్మారి ప్రభావంతో అతధికంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడం, దేశీయంగా కూడా గణనీయంగా ప్రయాణించే వారి సంఖ్య పడిపోతూ ఉండడంతో కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి.

పలు దేశీయ విమానయాన సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి. మార్కెట్‌ వాటాపరంగా దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తమ ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత విధిస్తున్నట్టు ప్రకటించింది.

వ్యక్తిగతంగా తన జీతంలో 25 శాతం కోత విధించుకొంటున్నట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సీఈవో రోనో దత్తా గురువారం తమ ఉద్యోగులకు పంపిన లేఖలో తెలిపారు. సీనియర్‌ వైస్‌ప్రెసిడెండ్‌, అంతకంటే పైస్థాయి అధికారుల వేతనాల్లో 20 శాతం, వైస్‌ ప్రెసిడెండ్‌, కాక్‌పిట్‌ సిబ్బంది వేతనాల్లో 15 శాతం, బ్యాండ్‌ డీ సిబ్బందితోపాటు క్యాబిన్‌ సిబ్బంది వేతనాల్లో 10 శాతం, బ్యాండ్‌ సీ సిబ్బంది వేతనాల్లో 5 శాతం కోత విధిస్తున్నట్టు ఆయన వివరించారు.

ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తే వారి కుటుంబాలకు ఎంత ఇబ్బందికరమో తమకు తెలుసని, కానీ ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి సంస్థ ముందుకు సాగాలంటే మనమంతా కొన్ని త్యాగాలు చేయక తప్పదని రోనో దత్తా ఆ లేఖలో స్పష్టం చేశారు. బ్యాండ్‌ ఏ, బ్యాండ్‌ బీ సిబ్బందికి మినహా ఉద్యోగులందరికీ ఏప్రిల్‌ 1 నుంచి వేతన కోతలు అమలవుతాయన్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీచేయడంతో మన అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం డొమెస్టిక్‌ బుకింగ్స్‌ కూడా 20 శాతం మేరకు తగ్గాయి. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియడంలేదు’ అని రోనో దత్తా తెలిపారు.

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా కూడా ‘ఇండిగో’ బాటలోనే నడుస్తున్నది. ఇప్పటికే పీకల్లోతున ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాపై కరోనా ప్రభావం ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన’ చందంలా మారింది. దీంతో ఎయిర్‌ ఇండియా కూడా తమ ఉద్యోగుల వేతనాల్లో స్వల్పంగా కోత విధించే అవకాశాలున్నాయి. ఈ కోత 5 శాతం మేరకు ఉండవచ్చని ఎయిర్‌ ఇండియా వర్గాలు చెప్తున్నాయి.

తీవ్రమైన ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పదేపదే విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు దాదాపు రెండేండ్ల నుంచి సింగిల్‌ బయ్యర్‌ ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం.

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా ఇప్పటికే తమ క్యాబిన్‌ సిబ్బందికి ఫ్లయింగ్‌ అలవెన్సులను తగ్గించడంతోపాటు పైలెట్లు, ఇతర సిబ్బందికి వినోద అలవెన్సును ఉపసంహరించింది.

ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా, కెనడా తదితర దేశాలకు ఎయిర్‌ ఇండియా అంతర్జాతీయ సర్వీసులన్నీ దాదాపు పూర్తిగా ఆగిపోవడంతో తమ ఉద్యోగుల వేతనాల్లో 5 శాతం కోత విధించాలని యోచిస్తున్నట్టు ఓ అధికారి ఓ వార్తా సంస్థకు తెలిపారు.

మరోవైపు కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిరోధించేందుకు ‘గోఎయిర్‌’ సంస్థ కూడా తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తమ ఉద్యోగులకు స్వల్పకాలంపాటు వేతనరహిత సెలవు ఇవ్వనున్నట్టు ‘గోఎయిర్‌’ ప్రకటించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనూహ్య పరిస్థితి నెలకొనడంతో ‘స్పైస్‌జెట్‌’ విమానయాన సంస్థ శనివారం (ఈ నెల 21) నుంచి ఏప్రిల్‌ 30 వరకు తమ అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. పరిస్థితులు సాధారణస్థాయికి చేరుకున్నాక సాధ్యమైనంత త్వరగా ఆ సర్వీసులను పునఃప్రారంభిస్తామని తెలిపింది.

భారత్‌ సహా పలు దేశాలపై కరోనా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు పెద్ద విమానయాన సంస్థలు ఇప్పటికే తమ సర్వీసులను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే.