https://oktelugu.com/

కరోనా ట్రీట్ మెంట్ ప్రైవేటుకు.. కేసీఆర్ ఎందుకిచ్చారు?

మొన్నటివరకు కూడా తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు అసలే అనుమతి ఇవ్వమని… సుప్రీం కోర్టు ఆదేశించినా వినమని.. వైద్యం ప్రభుత్వం చేతిలో ఉంటేనే ప్రజల ప్రాణాలకు విలువ, వారి డబ్బు హారతి కర్పూరం కాకుండా ఉంటుందని కేసీఆర్ ప్రెస్ మీట్లలో చెప్పుకొచ్చారు. ప్రైవేటుకు అనుమతిస్తే కరోనా చికిత్స పేరిట అవి దోచుకుంటాయని కేసీఆర్ ఆడిపోసుకున్నారు. ఇక చాలా సార్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సదుపాయాల పేరిట […]

Written By: , Updated On : June 16, 2020 / 04:55 PM IST
Follow us on


మొన్నటివరకు కూడా తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు అసలే అనుమతి ఇవ్వమని… సుప్రీం కోర్టు ఆదేశించినా వినమని.. వైద్యం ప్రభుత్వం చేతిలో ఉంటేనే ప్రజల ప్రాణాలకు విలువ, వారి డబ్బు హారతి కర్పూరం కాకుండా ఉంటుందని కేసీఆర్ ప్రెస్ మీట్లలో చెప్పుకొచ్చారు. ప్రైవేటుకు అనుమతిస్తే కరోనా చికిత్స పేరిట అవి దోచుకుంటాయని కేసీఆర్ ఆడిపోసుకున్నారు.

ఇక చాలా సార్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సదుపాయాల పేరిట రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని.. పరీక్షలు, చికిత్స అంటూ వారి ఆందోళనను క్యాష్ చేసుకొని పిప్పి పీల్చేస్తాయని కరోనా ప్రైవేట్ ట్రీట్ మెంట్ ను వ్యతిరేకించారు.

కరోనా ప్రబలుతున్న వేళ రోగులకు వారు కోరుకున్న చోట పరీక్షలు, చికిత్స చేసుకునే స్వేచ్ఛ కల్పించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించలేదు. తెలంగాణలో ఎవరికి వైరస్ సోకినా గాంధీ ఆస్పత్రికే రావాలని కేసీఆర్ పట్టుబట్టారు.

కానీ అకస్మాత్తుగా కేసీఆర్ కొన్ని రోజుల క్రితం సడన్ గా మాట మార్చుకున్నాడు. కరోనా రోగులకు చికిత్స చేయడానికి ప్రైవేట్ ఆస్పత్రులను అనుమతించాలని నిర్ణయించుకున్నాడు. పరీక్షల కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు కూడా అనుమతులు ఇచ్చారు. ఆస్పత్రులు వసూలు చేసే ఫీజును కూడా తెలంగాణలో ఫిక్స్ చేసి సోమవారం ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించింది.

కేసీఆర్ ఇంత అకస్మాత్తుగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికారణంపై మీడియా సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ దారుణ వైరస్ బారిన పడి బలైపోతున్న తన సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ప్రైవేట్ ఆస్పత్రులకు కేసీఆర్ అనుమతి ఇచ్చారని అంటున్నారు.

గత మూడు రోజుల్లో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారు ముగ్గురు కార్పొరేట్ ఆస్పత్రులలో చేరారు. దారుణమైన విషయం ఏంటంటే.. వారి అనుచరులు, వ్యక్తిగత సహాయకులు మాత్రం గాంధీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపింది.

కరోనా చికిత్సలో ఎమ్మెల్యేలను కూడా గాంధీ ఆస్పత్రిలోనే వేయాలని.. వీఐపీలకు సామాన్యులకు మధ్య ఈ వివక్ష ఏంటని తెలంగాణ సమాజం మీడియాలో, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోంది. కేసీఆర్ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల కోసమే ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు కేసీఆర్ ఇచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు.

అయితే కరోనా వైరస్ తో ఎక్కువమంది రాజకీయ నాయకులు గాంధీలో చేరడంతో వారందరికీ వీఐపీ ట్రీట్ మెంట్ నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం గ్రహించింది. అందుకే విమర్శలు వచ్చినా కూడా ప్రైవేట్ ఆస్పత్రులను అనుమతించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే గాంధీకి తాకిడి ఎక్కువవుతుందని.. నేతలు మరణిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే కేసీఆర్ ఇలా ప్రైవేట్ బాటపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. .

-నరేశ్ ఎన్నం