https://oktelugu.com/

శాసన సభ సమావేశాల్లో చర్చలు లేనట్టే..!

ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ఈ సారి భిన్నంగా సాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ శాసన సభలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకు భిన్నంగా రాజ్ భవన్ నుంచే గవర్నర్ ప్రసంగించారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏ అంశాలపై చర్చ లేకుండానే ఈ శాసన సభ సమావేశాలు ముగియనున్నాయి. బడ్జెట్ సమావేశాలు చర్చలు లేకుండా ముగియడం ఇదే తొలిసారి కావచ్చు. గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. రేపు […]

Written By: , Updated On : June 16, 2020 / 06:16 PM IST
Follow us on


ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ఈ సారి భిన్నంగా సాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ శాసన సభలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకు భిన్నంగా రాజ్ భవన్ నుంచే గవర్నర్ ప్రసంగించారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏ అంశాలపై చర్చ లేకుండానే ఈ శాసన సభ సమావేశాలు ముగియనున్నాయి. బడ్జెట్ సమావేశాలు చర్చలు లేకుండా ముగియడం ఇదే తొలిసారి కావచ్చు. గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. రేపు సభ ముందుకు కొన్ని బిల్లులు తీసుకు వస్తారు. వాటి ఆమోదం అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్ పై, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగడం సాంప్రదాయం. అనంతరం సభ్యులు వివిధ అంశాలపై ఇచ్చిన నోటీసులపై స్పీకర్ నిర్ణయం తీసుకుని చర్చకు అనుమతిస్తారు.

శాసన సభను రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ రెండు రోజులు మాత్రమే జరుగుతుందని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. టీడీపీ తరుపున సమావేశంలో పాల్గొన్న నిమ్మల రామానాయుడు సభలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, కనీసం వారం నుంచి పది రోజులు నిర్వహించాలని కోరారు. సమయం తక్కువగా ఉంటే ప్రతి పక్షం నుంచి ఒకరు, అధికార పక్షం నుంచి ఒక్కరికి మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా  అచ్చెన్నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారని దీనిపై చర్చ జరగాలని కోరగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని బయట మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడవద్దని సూచించారు. కనీసం వర్చ్యువల్ విధానంలో అయినా కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిమ్మల కోరారు. పార్లమెంట్ వర్చ్యువల్ విధానంలో నిర్వహిస్తే అప్పుడు ఆలోచిద్దామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశాల్లో మొత్తం 16 అంశాలపై చర్చ జరపాలని టీడీపీ భావించింది. వీటిలో అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, అమరావతి రాజధాని అంశం, ప్రత్యేక హోదా, కరెంట్ చార్జీల పెంపు, బలవంతపు భూసేకరణ, భూ కొనుగోళ్లలో అక్రమాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం ధరల పెరుగుదల, దళితులపై దాడులు, బిల్డ్ ఏపీ ఇలా తదితర అంశాలను సభలో చర్చించాలని టీడీపీ కోరుతుంది. కానీ ప్రభుత్వం కరోనాను సాకుగా చూపి సభలో చర్చలు లేకుండా బడ్జెట్, బిల్లుల ఆమోదానికి మాత్రమే పరిమితం చేశారు.