https://oktelugu.com/

రోగనిరోధక శక్తి వర్సెస్ కోవిద్

కోవిద్ మనిషిలోని అంతర్గత రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందా? తిరిగి తిరిగి కరోనా కాటుకు వీలుంటుందా? అనే అంశంపై విస్తృతస్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇమ్యూనిటీ లేకపోవడంతోనే కరోనా సంక్రమిస్తుంది. ఇక కరోనాతో మనిషిలోని ఈ రోగనిరోధక శక్తి మరింత ప్రభావితం అవుతుందా? లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని శాస్త్రజ్ఞులు తెలిపారు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో పలు పరిశోధనలు, రోగులపై అధ్యయనాలు జరిగాయి. కోవిడ్ వచ్చి కోలుకుంటున్న వారు లేదా కోలుకున్న వారిలో రోగనిరోధక కారక కణాలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 / 05:18 PM IST
    Follow us on

    కోవిద్ మనిషిలోని అంతర్గత రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందా? తిరిగి తిరిగి కరోనా కాటుకు వీలుంటుందా? అనే అంశంపై విస్తృతస్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇమ్యూనిటీ లేకపోవడంతోనే కరోనా సంక్రమిస్తుంది. ఇక కరోనాతో మనిషిలోని ఈ రోగనిరోధక శక్తి మరింత ప్రభావితం అవుతుందా? లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని శాస్త్రజ్ఞులు తెలిపారు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో పలు పరిశోధనలు, రోగులపై అధ్యయనాలు జరిగాయి. కోవిడ్ వచ్చి కోలుకుంటున్న వారు లేదా కోలుకున్న వారిలో రోగనిరోధక కారక కణాలు అయిన యాంటీబాడీస్ కొంతకాలమే ఉంటున్నాయని, అవి క్రమేపీ క్షీణిస్తున్నాయనే ఆందోళనకర పరిణామాన్ని సైంటిస్టులు గుర్తించారు.

    దీనితో ఒక్కసారి కరోనా వచ్చిన వారికి దీర్ఘకాలిక ఇమ్యూనిటీ ఏర్పడటం కష్టమని ఈ పరిశోధనలలో సంకేతాలు వెలువడ్డాయి. అయితే దీనితో కరోనా వచ్చి కోలుకున్న వారు ఏమవుతుందో అని భయపడాల్సిన పనిలేదని వారికి తిరిగి కరోనా అంటుకుంటుందనే వాదన ఇంకా నిర్థారణ కాలేదని వీరు తెలిపారు. కరోనాకు చికిత్స దశలోమనిషిలో కొన్ని రకాల ప్రత్యేక కణాలు ఏర్పడుతాయి. ఇవి వ్యాధిని ఎదుర్కొనే స్థాయిలో ఉంటాయి. ఇవి కొంతకాలమే పనిచేస్తాయని చెప్పడానికి వీల్లేదని, దీనికి సంబంధించి విస్తృత స్థాయి పరిశోధనలు అవసరం అని వారు తెలిపారు. కాలం గడుస్తున్న కొద్దీ మనిషిలోని యాంటీబాడీస్ త్వరితగతిన తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం ఏ మేరకు మనిషికి చేటు కల్గిస్తుందనేది ఇప్పటికైతే నిర్థారణ కాలేదు.

    నాబ్స్‌తోనే కరోనా పదేపదే

    యాంటీబాడీస్ స్థాయిని శాస్త్రీయంగా వైద్యపరిభాషలో నావెల్ కరోనావైరస్ బ్లాకింగ్ యాంటీబాడీ లెవల్స్ (నాబ్స్) అని పిలుస్తారు. ఈ స్థాయి తగ్గితే కరోనా తిరిగి రావచ్చునని ప్రచారం జరుగుతోంది. దీనితో కోలుకున్న వారిలో అత్యధికులు మునుపటి ఉత్సాహాన్ని పొందలేకపోతున్నారు. అయితే ఈ విధమైన నిరాశానిస్పృహలకు గురికావల్సిన అవసరం లేదని పుణేలోని ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రిసర్చ్‌కు చెందిన ఇమ్యూనాలజిస్టు వినీతా బాల్ తెలిపారు. ఈ కరోనా మహమ్మారి కేవలం ఆరునెలల నుంచి ఆటాడిస్తోంది. దీని పూర్తి లక్షణాలు, కోలుకున్న తరువాత పరిస్థితి ఏమిటనేది ఇంకా నిర్థారణ కాలేదని వెల్లడించారు. కరోనా వచ్చి కోలుకున్న వారు తిరిగి వెంటనే వైరస్ కాటుకు గురికావడం అరుదుగా జరుగుతుంది. జనవరిలో తొలిసారిగా వైరస్‌కు గురైన వారిలో ఎక్కువగా ఈ రెండోసారి దాడి పరిణామం ఉంటోందని వీడియో ఇంటర్వూలో తెలిపారు. ఇటీవలే మెడ్‌ఆర్‌క్సివ్‌లో ప్రచురితమైన వ్యాసం కొందరిలో పలు రకాల ఆందోళనకు దారితీసింది.

    యాంటీబాడీస్ క్షీణత రెండునెలల్లోనే

    ఇంకా పూర్తిస్థాయి అధ్యయనాలు కాకముందే కోవిడ్‌ రోగుల్లో యాంటీబాడీస్ 18 నుంచి 65 రోజుల వ్యవధిలో రెండు నుంచి 23 వంతులు తగ్గుతాయని తేల్చారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో 90 శాతం మందిపై ఈ పరిశోధనలు జరిగాయి. ఇక ఈ నాబ్స్ రోగులు కోలుకున్న తరువాతి క్రమంలో కేవలం రెండు నుంచి మూడు నెలల్లోపే తగ్గుతాయని గత నెలలో నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ఓ వ్యాసం ప్రచురితం అయింది. అయితే ఈ అధ్యయనాలు వీటి వెల్లడి గురించి ఎక్కువగా తెలియని వారికి, విద్యాధికులు కాని వారికి తాము కోలుకున్నమనే తెలిసింది కానీ తరువాతి క్రమంలో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది తెలియడం లేదు. ఇటువంటి వారు ఎటువంటి ఆందోళనకు గురి కావడం లేదు. నాబ్స్ స్థాయి తగ్గిపోవడం వల్లనే తిరిగి వైరస్ సంక్రమిస్తుందని చెప్పడానికి వీల్లేదని బాల్ తెలిపారు.

    సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఈ మహిళా టాస్క్‌ఫోర్స్‌ను ప్రధాని ఆదేశాలతో ఏర్పాటు చేశారు. రోగులలో యాంటీబాడీస్ తగ్గుతాయనేది నిర్థారించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, మరో ఏడాది పడుతుందని సైంటిస్టులు తెలిపారు. రెండు అధ్యయనాలలో అయితే కరోనా వచ్చి కోలుకున్న వారిలో యాంటీబాడీస్ తగ్గుతాయని తేలింది. అయితే ఇమ్యూనిటీ వ్యవస్థపై పరిశోధనలు చేసిన మరికొందరు ఈ ఇమ్యూనిటీకి ఢోకా ఉండదని ఇది చాలా కాలం నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. మనుష్యులలో ఏర్పడే టి సెల్స్ తిరిగి వైరస్ రాకుండా పనిచేస్తాయని, ఇవే రక్షకకవచాలు అవుతాయని పరిశోధకురాలు బాల్ తెలిపారు