దేశంలో కరోనాపై పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు ఆ మహమ్మరి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలకు సమాచారాన్ని అందించే జర్నలిస్టులు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. దేశంలోనే కరోనా కేసుల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఈమేరకు ముంబైలో పనిచేస్తున్న 60మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్లు తేలింది. అదేవిధంగా చెన్నైలోని ఓ టీవీ ఛానల్లో పనిచేస్తున్న 27మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. వీరిందరికి ఐసోలేషన్ కు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
తాజాగా తెలంగాణలోనూ జర్నలిస్టుకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో సదరు జర్నలిస్టును గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన జర్నలిస్టు సోదరుడికి తొలుత కరోనా సోకింది. వ్యక్తిగత పనుల కోసం అతడు కర్నూలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడికి కరోనా లక్షణాలు కన్పించింది. దీంతో అతడి కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. ఈమేరకు అక్కడే ఉన్న సదరు జర్నలిస్టును టెస్టు చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.