దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి కోరలు చాస్తోందా? థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయా? కేరళ , మహారాష్ట్రలో ఇప్పటికే థర్డ్ వేవ్ చాయలు కనిపిస్తున్నాయి. అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ తప్పదన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది.
దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా 3.60లక్షల టెస్టులు చేయగా.. కొత్తగా 40134 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 422 మంది చనిపోయారు. కొద్దిరోజులుగా కొత్త కేసుల్లో పెరుగుదల థర్డ్ వేవ్ కు దారితీస్తుందా? అన్న ఆందోళన కనిపిస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల రోజువారీర్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా కేసుల పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సగానికి పైగా కేసులు కేరళ, మహారాష్ట్రల్లోనే వెలుగుచూస్తున్నాయి. 40కిపైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా నమోదవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వెలువడిన ఓ అధ్యయనం మూడో ముప్పు వేళ ఎన్ని కేసులు వెలుగుచూడనున్నాయో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది.
ఈ 10 రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటిందని, మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్యన ఉందని వివరించింది. ఈ జిల్లాల్లో ఏమాత్రం అలసత్వం చూపించినా పరిస్థితి దారుణంగా మారుతుందని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కంటైన్మెంట్ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయడమే కాకుండా, 60 ఏళ్లు పైబడినవారికి, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా వ్యవస్థలపై నియంత్రణ, జన సమూహాలను నిరోధించడం తప్పనిసరి అని పేర్కొంది.. కేసులు ఇలాగే పెరిగి అక్టోబర్ నాటికి గరిష్ట్రస్తాయికి చేరుకుంటాయని థర్డ్ వేవ్ అక్టోబర్ లో తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.