
‘3,86,000’.. గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య ఇది. ఈ నంబర్ రోజు రోజుకూ వరద ప్రవాహంలా పెరుగుతూనే ఉంది. దీంతో.. ఇటు ఆసుపత్రులకు రోగులు పోటెత్తుతుండగా.. అటు శ్మశానాలు శవాలతో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా అయిపోవడంతో.. దేశంలో ఆర్తనాదాలు మిన్నంటున్నాయి.
ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా ఏమీలేదు. తెలంగాణలో రోజూ కేసులు 8 వేల దగ్గరకు చేరుకోగా.. ఏపీలో 10 వేల మార్కును చేరుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలను ఆదుకునేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు ఒక్క నేత కూడా కనిపించవకపోవడం గమనార్హం.
కొవిడ్ తొలి దశలో ప్రభుత్వాలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా సాధ్యమైనంత మేర స్పందించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు ముందుకొచ్చారు. మాస్కులు సరఫరా చేయడం.. శానిటైజేషన్ దగ్గరుంచి చేయించడం వంటి పనులు కూడా నిర్వహించారు. అవకాశం ఉన్నవారు ప్రజలకు నిత్యావసరాలు కూడా అందించారు. మరికొందరు మందులు సరఫరా చేశారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.
రాజకీయ నేతలు కాదుగదా.. ప్రజాప్రతినిధులు కూడా పత్తాలేకుండా పోయారు. రాష్ట్రంలో ఎవరో ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారంతా ఎవరి ఇంట్లో వారు కూర్చున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోకి కూడా రావట్లేదు. దీంతో.. క్షేత్రస్థాయిలో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఇలాంటి సందర్భంల్లో తాత్కాలికంగా కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. కానీ.. వీటి ఊసే లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతుంటే.. ఏపీ సీఎం జగన్ కూడా కరోనా అంశాన్ని జనాలకే వదిలేసినట్టున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆరాతీస్తూ.. ఏం చేయాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీచేయాల్సిన వారు సైలెంట్ గా ఉండడంతో.. అధికారులు తమకు తోచిన విధంగా ముందుకెళ్తున్నారు. దీంతో.. జనం ప్రాణాలు గాల్లో దీపమై మిణుకుమిణుకు మంటున్నాయి. అందులో లెక్కలేనన్ని అన్యాయంగా ఆరిపోతూ ఉన్నాయి.