Vijayasai Reddy: వైసీపీలో సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి రెండు వపర్ సెంటర్లు. ఇద్దరూ సీఎం జగన్ కు నమ్మిన బంట్లే. అయితే గత కొద్దిరోజులుగా వీరి మధ్య గ్యాప్ వచ్చినట్టు పుకార్లు, షికార్లు చేశాయి. విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గించి సజ్జలకు పెంచారన్న విమర్శలు వచ్చాయి. పార్టీలో సజ్జల గ్రాఫ్ పెరిగిందన్న టాక్ నడిచింది. పాలనా వ్యవహారాలతో పాటు పార్టీ కార్యక్రమాలు, కార్యవర్గాల్లో అధినేత జగన్ సజ్జలకే ప్రాధాన్యమిచ్చారని పార్టీ వర్గాలు భావిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలు కలవడం, కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడడం ఇప్పడు చర్చనీయాంశమైంది. ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డిని తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. కానీ విజయసాయిరెడ్డి అంతకు ముందు నుంచే జాబ్ మెళాల నిర్వహణకు సన్నాహాలు చేశారు. విశాఖలో ఒకటి, తిరుపతిలో ఒక భారీ జాబ్ మేళాకు ఏర్పాట్లు చేసుకున్నారు. తరువాత జరిగిన పరిణామాలతో రకరకాల చర్చలు నడిచాయి. జాబ్ మేళాల నిర్వహణ ప్రభుత్వ, పార్టీ పెద్దలకు ఇష్టం లేదని, విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకునేందుకే ఎత్తుగడ విమర్శలు నడిచాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా విజయసాయి విశాఖ, తిరుపతిలో జాబ్ మేళాలు పూర్తిచేశారు. గుంటూరులో నిర్వహణకు సిద్ధమయ్యారు. శని, ఆదివారాల్లో ఈ జాబ్ మేళాను నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటు చేశారు.ఇప్పటికే నిరుద్యోగులు జాబ్ మేళా పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ జాబ్ మేళా ఏర్పాట్లలో బిజగా ఉన్న విజయసాయిరెడ్డి హఠాత్తుగా సజ్జల ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వీరి భేటీ అటు వైసీపీలొ, ఇటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ బేటీ వివరాలను మాత్రం ఇరువురూ వెల్లడించలేదు. సజ్జలతో భేటీ తర్వాత జాబ్ మేళా ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిపోయారు. జాబ్ మేళాల విషయంలో వస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చేందుకే సజ్జల ఇంటికి విజయసాయిరెడ్డి వెళ్లారన్న టాక్ నడుస్తోంది.
ఇమేజ్ పెంచుకునేందుకే…
ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తోంది. సిఎం ఆదేశాల మేరకే జాబ్ మేళా చేపట్టామని.. తిరుపతి, వైజాగ్ జాబ్ మేళా ల్లో 30,473 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. గుంటూరు జాబ్ మేళాలో 210 కంపెనీలు 26289 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. 97000 మంది ఈ జాబ్ మేళా కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని… ఉద్యోగం రాని వారికి స్కిల్ డెలవప్ మెంట్ శిక్షణ ఇచ్చి మరోసారి జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఇస్తామన్నారు. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ..జాబ్ మేళాలు కొనసాగిస్తామని ప్రకటించారు. జాబ్ మేళా నిర్వహణలో ఎలాంటి రాజకీయం ప్రయోజనం లేదని.. నిరుద్యోగుల కోసమే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని విజయసాయి చెబుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యాల వెనుక పరిణామాలు చాలా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత ఈమేజ్ పెంచుకునేందుకు క్రికెట్, క్రీడా పోటీల నిర్వహణ వంటివి చేస్తున్నారు. అందులో భాగంగా జాబ్ మేళాలకు శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో అధిష్టానం అనుమతి తీసుకోలేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో సీఎం జగన్ కు చిర్రొత్తుకొచ్చింది. అందుకే సజ్జలతో వివరణ కోరినట్టు ప్రచారం ఉంది. అయితే అటువంటిదేమీ లేదని.. సీఎం జగన్ ఆదేశాల మేరకు మాత్రమే జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు విజయసాయిరెడ్డి చెబుతున్నారు.
చుట్టుముడుతున్న విమర్శలు
మరోవైపు జాబ్ మేళాల నిర్వహణ కూడా బాగాలేదన్న విమర్శలు ప్రభుత్వ పెద్దల వరకూ చేరాయి. కేవలం హెల్పర్లు, సెక్యూరిటీ గార్డుల ఎంపికకే పరిమితమయ్యారన్న ప్రచారం సాగుతోంది. ఎంపికైన అభ్యర్థులకు అసలు ఆఫర్ లెటర్లు ఇవ్వకపోవడం దుమారానికి దారి తీస్తోంది. ఎక్కడైనా ఉద్యోగాలకు ఎంపికైతే వెంటనే ఆఫర్ లెటర్లు ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇవ్వలేదు. సరికదా.. రెజ్యూమ్ తీసుకుని తర్వాత చెబుతామని పంపేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఆది నుంచి జాబ్ మేళాల నిర్వహణను విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదేదో రాజకీయ ప్రయోజనం ఆశించి చేస్తున్నది కాదని.. చిత్తశుద్ధితో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్, కనస్ట్రక్షన్స్ కంపెనీలు ఉద్యోగాలిస్తున్నాయని.. జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చిన వారికి స్థాయిని బట్టి 15 వేల నుంచి లక్ష రూపాయాల వరకు జీతం ఉంటుందని చెప్పుకొచ్చారు.కానీ ప్రచారం మరోలా సాగడంతో విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ వివరించేందుకే ఆయన సజ్జలను కలిశారన్న టాక్ నడస్తోంది.