KTR Satires On Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేస్తున్నారు. పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు కానీ కేసీఆర్ లోకల్ ఇక్కడే ఉంటారు అంటూ పంచులు వేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. వారు రైతు డిక్లరేషన్ చేసినా ఏది చూపించినా ఎవరు ఇక్కడ వారి పాలన గురించి విశ్వాసం వ్యక్తం చేయడం లేదు. అందుకే వారి తృప్తి కోసమే వరంగల్ ల సభ పెట్టుకున్నారు. ప్రజల్లో ఒకసారి విశ్వసనీయత పోయాక తిరిగి రావడం కల్ల అని వారికి తెలియదా అంటూ చురకలంటించారు.

దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీల్లో విమర్శల జోరు పెరుగుతోంది. వరంగల్ లో రాహుల్ గాంధీ అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు ఒక్కటేనని అభివర్ణించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజలను అధోగతి పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తమ స్వార్థం కోసం పని చేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పుడే రాజకీయ వేడి ప్రారంభమైందని తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ కేసీఆర్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలు తమదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. రాహుల్ గాంధీ పర్యటనతో తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. అధికార పక్షంపై దాడికి సిద్ధమవుతోంది. ఇదే అదనుగా తమ పలుకుబడి పెంచుకోవాలని చూస్తోంది.
ఈ మేరకు రైతు డిక్లరేషన్ ఇచ్చి ప్రజల్లో పోయిన పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తాపత్రయడుతోంది. నేతల్లో ఐకమత్యం ఉండాలని రాహుల్ గాంధీ సూచించినా వారు ఏ మేరకు నడుచుకుంటారో తెలియడం లేదు. మొత్తానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలను గాడిలో పెట్టాలని చూసినా ఎంత మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రచార హోరు మొదలైందని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావానికి నాంది పలికింది. దీంతో ఇప్పటికే బీజేపీ పాదయాత్రతో దూసుకుపోతుండగా ఇంకా టీఆర్ఎస్ మాత్రం తన ప్రచారాన్ని ప్రారంభించడం లేదు.
