ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. 53గా ఉన్న మంత్రులు ప్రస్తుతం 77కు పెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మార్కును ప్రదర్శించి మంత్రివర్గాన్ని కూర్చారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏఏ ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలో లెక్కలు వేసుకుని మరీ మంత్రులను ఎంపీక చేసుకున్నారు. ఇందులో వారిపై ఉన్న కేసులు, ఆస్తులు, అప్పులు సైతం లెక్కలోకి తీసుకుంటే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.
మంత్రుల్లో పలువురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొందరిపై హత్యారోపణలు సైతం నమోదయ్యాయి. కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారిలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. ఇందులో 31 శాతం మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న నిశిత్ ప్రమానిక్ పైన హత్యా నేరం ఉండడం ఆలోచించదగ్గ విషయమే. నలుగురు మంత్రులపై హత్యాయత్నం కేసులు ఉండడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్ కు చెందిన జాన్ బర్లాపై 24 కేసులు ఉండగా నిశిత్ ప్రమానిక్ పై 21 కేసులు ఉన్నట్లు తేలింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన పంకజ్ చౌదరిపై ఆరు క్రిమినల్ కేసులుండగా మహారాష్ర్టకు చెందిన మురళీధరన్ పై మూడు కేసులు ఉన్నాయి. మొత్తం కేబినెట్ లో ఆరుగురు మంత్రులపై మత ఘర్షణ కేసులు ఉండడం విశేషం. మత విశ్వాసాల్ని అవమానించడం ద్వారా మతపరమైన ఘర్షణలకు ఉద్దేశపూర్వక చర్యలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అమిత్ షా (గుజరాత్) గిరిరాజ్ సింగ్ (గుజరాత్), శోభ కరాంద్లాజే (కర్ణాటక), నిత్యానంద రాయ్ (బిహార్)కు చెందిన నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యార్హతల విషయంలో 8-12 తరగతి వరకు చదివిన వారు 12 మంది మంత్రులు ఉన్నారు. 64 మంది మంత్రులు గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ చదివినట్లు తేలింది. ఎనిమిదో తరగతి చదివిన వారిలో జాన్ బర్లా, నిశిత్ ప్రమానిక్ ఉన్నారు. పదో తరగతి పాసైన వారిలో బిశ్వేశ్వర్ తుడు, రామేశ్వర్ తేలి, నారాయణరాణే ఉన్నారు. ప్లస్టూ పూర్తి చేసిన వారిలో అమిత్ షా, అర్జున్ ముండా, పంకజ్ చౌదరి, రేణుక సింగ్ సూరత, సాధ్వి నిరంజన్ జ్యోతి, స్మృతి ఇరానీ, రాందాస్ అథవాలే ఉన్నట్లు తెలిసింది.